Al Qaeda terror module arrested : బెంగళూరులో గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) మహిళ షామా పర్వీన్‌ను అరెస్ట్ చేసింది. ఆమె అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్ (AQIS) ఉగ్రవాద మాడ్యూల్‌కు సంబంధించిన కీలక కుట్రదారుగా సీమా పర్వీన్ ను గుర్తించారు. 30 ఏళ్ల వయసు ఉన్న జార్ఖండ్‌కు చెందిన షామా పర్వీన్ గత మూడేళ్లుగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన సోదరుడితో కలిసి నివసిస్తోంది. ఆమె గ్రాడ్యుయేట్ అయినప్పటికీ ఉద్యోగం చేయడం లేదు.
గుజరాత్ ATS జూలై 23న ఢిల్లీ, నోయిడా, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల నుంచి నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరు మొహమ్మద్ ఫైక్ (ఢిల్లీ), మొహమ్మద్ ఫర్దీన్ (అహ్మదాబాద్), సైఫుల్లా కురేషీ (మొడాసా, గుజరాత్), జీషాన్ అలీ (నోయిడా). వీరి విచారణలో షామా పర్వీన్ పేరు బయటపడింది. జూన్ 10, 2025న ATS డిప్యూటీ SP హర్ష్ ఉపాధ్యాయకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా దేశ వ్యతిరేక, రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తి చేస్తున్న సమాచారం అందింది. ఈ ఖాతాలు AQIS యొక్క ఉగ్రవాద కంటెంట్, జిహాదీ వీడియోలు, హింసను ప్రోత్సహించే సందేశాలను వ్యాప్తి చేస్తున్నాయి. షామా పర్వీన్ ఈ మాడ్యూల్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాడికల్ కంటెంట్‌ను షేర్ చేస్తూ, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఆమె అల్-ఖైదా భావజాలాన్ని బహిరంగంగా సమర్థించి, షరియా చట్టాన్ని స్థాపించడం, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రోత్సహించే వీడియోలు, పోస్టులను షేర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
షామా పర్వీన్ నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లతో సహా డిజిటల్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో అరెస్టు చేసిన నలుగురు ఉగ్రవాదుల వద్ద నుంచి AQIS సాహిత్యం, ఒక కత్తి, జిహాదీ కంటెంట్‌తో కూడిన వీడియోలు, షరియా చట్టాన్ని సమర్థిస్తూ రెచ్చగొట్టే వీడియోలను కనిపెట్టారు. మొహమ్మద్ ఫైక్ వద్ద నుంచి కత్తిని వీడియోలో ఊపుతూ “ఇది మాత్రమే తక్కువగా ఉంది, ఇప్పుడు అన్నీ పూర్తయ్యాయి... అల్లాహు అక్బర్!” అని చెప్పే వీడియో కూడా లభించింది. నిందితులు ఆటో-డిలీట్ యాప్‌ల ద్వారా కమ్యూనికేషన్‌ను రహస్యంగా నిర్వహించినట్లు, పాకిస్తాన్‌లోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది.
నిందితులపై అన్‌లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్) యాక్ట్ (UAPA) సెక్షన్లు 13, 18, 38, 39, ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 113, 152, 196, 68 కింద కేసు నమోదు చేశారు. ఫర్దీన్ , సైఫుల్లాకు 14 రోజుల రిమాండ్ విధించారు. - షామా పర్వీన్‌ను కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్ పొందిన తర్వాత గుజరాత్‌కు తరలించారు. ఈ అరెస్టు దేశ భద్రతకు ఒక ముఖ్యమైన విజయంగా భావిస్తున్నారు. ఈ మాడ్యూల్ భారతదేశంలో గజ్వా-ఎ-హింద్ భావజాలం ద్వారా సామాజిక అసహనాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి కుట్ర పన్నినట్లు ATS తెలిపింది. బెంగళూరులో ఈ ఘటన తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి, నగరంలో నిఘా పెంచాయి.