Massive polling recorded in Assam, Kerala and Puducherry : అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న  మూడు ముఖ్యమైన రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. కేరళ, అసోం ,  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలలో ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో భద్రపరిచారు. సాయంత్రం 5 గంటల వరకు నమోదైన అధికారిక గణాంకాలను బట్టి చూస్తే, ప్రజలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చినట్లు స్పష్టమవుతోంది.  కేరళ: హోరాహోరీ పోరులో  భారీ  ఓటింగ్

Continues below advertisement

కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఎల్డీఎఫ్ (LDF) , యూడీఎఫ్ (UDF) మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ రాష్ట్రంలో ఓటర్లు ఎప్పటిలాగే చైతన్యాన్ని చాటారు. సాయంత్రం 5 గంటల సమయానికి కేరళలో సుమారు 75శాతానికిపైగా  పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు క్యూలైన్లలో అధిక సంఖ్యలో కనిపించారు. క్యూలో ఉన్న వారందరికీ ఓటు  వేసే అవకాశం లభిస్తుంది. అందుకే పోలింగ్ శాతం ఎనభై శాతం వరకూ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి .కేరళలో ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీ కనిపించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.   

 అసోంలో రికార్డు స్థాయి పోలింగ్ 

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఒకే విడతలో  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  84.42% భారీ ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన  తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన కుటుంబంతో కలిసి జలుక్‌బరీలో ఓటు వేయగా, కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ జోర్హాట్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడక్కడా ఈవీఎంల మొరాయింపు, ఒకచోట పోలింగ్ కేంద్రం లోపల వీడియో తీసినందుకు ఎఫ్ఐఆర్ నమోదు కావడం వంటి చిన్న చిన్న సంఘటనలు మినహా, 31,490 కేంద్రాల్లో పోలింగ్ సజావుగా సాగింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హ్యాట్రిక్ విజయం కోసం చూస్తుండగా, పదేళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి గట్టిగా పోరాడుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.  

పుదుచ్చేరిలోనూ ఓటెత్తిన జనం  కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు  ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు  82.35%   భారీ ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు, ముఖ్యంగా మహిళా ఓటర్లు , యువత అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్‌ఆర్ కాంగ్రెస్-బీజేపీ కూటమి , కాంగ్రెస్-డీఎంకే కూటమిల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఈ ఎన్నికలలో, అక్కడక్కడా ఈవీఎంల సాంకేతిక సమస్యలు మినహా పోలింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా సాగింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులు తమ నియోజకవర్గాల్లో ఓటు వేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగిన ఈ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన వెలువడనున్నాయి.    turnout records Puducherry leads with 86.92 per cent, followed closely by Assam at 84.42 per cent, and Kerala at 75.01 per cent.#Assemblypolls