Maharashtra Factory Fire Accident:
ఘోర అగ్ని ప్రమాదం..
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్రపతి సాంబాజీ నగర్‌లో గ్లోవ్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లదంరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. మంటల్ని అదుపు చేసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అర్ధరాత్రి చెలరేగిన మంటలు తెల్లారాకగానీ అదుపులోకి రాలేదు. బిల్డింగ్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే...అప్పటికే మంటల్లో ఆరుగురు కాలి బూడిదైపోయారు. రాత్రి ఫ్యాక్టరీ మూసేసి ఉంది. కార్మికులంతా పడుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించి తప్పించుకునే లోపే కొందరు మంటల్లో చిక్కుకున్నారు. ఆ సమయంలో ఫ్యాక్టరీ 10-15 మంది ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
"అర్దరాత్రి 2 గంటలకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. మేం ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే మంటలు వ్యాపించాయి. అప్పటికే ఆరుగురు చనిపోయారని స్థానికులు చెప్పారు. ఆ ఆరుగురి మృతదేహాల్నీ స్వాధీనం చేసుకున్నాం"
- అగ్నిమాపక సిబ్బంది
కంట్రోల్ రూమ్‌కి మధ్యరాత్రి 1 గంటకు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం ఎందుకు జరిగిందో ప్రస్తుతానికి తెలియలేదని, పూర్తి విచారణ చేపట్టిన తరవాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అయితే...ఉన్నట్టుండి ఫ్యాక్టరీలో మంటలు రావడం వల్ల స్థానికులు భయపడిపోయారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
మధ్యప్రదేశ్‌లో ఇటీవలే ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు ఆహుతి అయ్యారు. గుణలో తెల్లవారుజామున గుణ-ఆరోన్ రోడ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో బస్‌లో మొత్తం 30 మంది ప్రయాణికులున్నారు. 13 మంది అక్కడికక్కడే చనిపోగా..మిగతా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే వీళ్లందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందిస్తున్నట్టు ప్రకటించారు. గాయపడిన వాళ్లలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని కలెక్టర్ వెల్లడించారు. మంటలు వచ్చిన వెంటనే కొంత మంది ఎలాగోలా బయటపడ్డారు. అందుకే మృతుల సంఖ్య తక్కువగా నమోదైందని అధికారులు తెలిపారు.
Also Read: ఆకలితో అలమటిస్తుంటే దీపావళి చేసుకోమంటారా - ప్రధాని మోదీపై ప్రతిపక్షాల ఆగ్రహం