విశాఖపట్నంలోని ఓ ఇంట్లో ఆదివారం రాత్రి జరిగిన భారీ పేలుడు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 89వ వార్డు ఆదర్శనగర్, ఎర్రచెరువు రజక కాలనీలోని ఒక భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా సంభవించిన ఈ పేలుడు శబ్దం కిలోమీటర్ల మేర వినిపించడంతో, భయంతో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

Continues below advertisement

స్థానిక యువకుల సాహసం..

స్థానికుల సమాచారం ప్రకారం, సదరు భవనంలో కొంతకాలంగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మందుగుండు సామగ్రిని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన వెంటనే ఆ భవనంలో మంటలు చెలరేగాయి. అయితే, స్థానిక యువకులు సకాలంలో స్పందించి సాహసంతో మంటలను అదుపు చేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

Continues below advertisement

సమాచారం అందుకున్న వెంటనే గోపాలపట్నం సీఐ సన్యాసి నాయుడు, ఎస్సై రామారావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ప్రాథమిక తనిఖీలు చేపట్టి, అక్కడ నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల వివరాలను సేకరిస్తున్నారు. భవన యజమాని ఎవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించడమే కాకుండా, భవనంలో ఇంకా ఏవైనా ప్రమాదకర పదార్థాలు మిగిలి ఉన్నాయా అనే అంశంపై క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ప్రస్తుతం ఆదర్శనగర్, ఎర్రచెరువు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నివాస ప్రాంతాల మధ్య ఇలాంటి ప్రమాదకరమైన కార్యకలాపాలు సాగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

విశాఖపట్నం జీవీఎంసీ 89వ వార్డు ఆదర్శనగర్‌లో ఆదివారం రాత్రి సంభవించిన భారీ పేలుడు స్థానికులను వణికించింది. 'బాంబుల శివ'గా పిలవబడే డి.శివకృష్ణకుమార్ అనే వ్యక్తి, శ్మశానవాటిక సమీపంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని అనధికారికంగా బాణసంచా తయారు చేస్తున్నాడు. ఈ నెల 18న జరగనున్న ఉత్సవాల కోసం భారీగా మందుగుండు సామగ్రిని నిల్వ చేయగా, ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి.

ఈ పేలుళ్ల ధాటికి ఇంటి గోడలు ముక్కలై పక్కనే ఉన్న రేకుల షెడ్లపై పడటంతో పాటు, సమీప ఇళ్ల గోడలు పగుళ్లిచ్చాయి. ఇంట్లోని వస్తువులు, ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్లాబ్ పెచ్చులు తగిలి ఒక మహిళకు స్వల్ప గాయాలవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ పేలుడు శబ్దం సుమారు మూడు కిలోమీటర్ల మేర వినిపించిందని స్థానికులు తెలిపారు. నివాస ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదకర నిల్వలు ఉంచడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.