హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారిలో ముగ్గురు నిందితులకు ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్ విధించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారి నమిత్ శర్మలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు తనిఖీల సమయంలో నమిత్ శర్మ గాలిలోకి కాల్పులు జరపడం ఈ కేసులో అత్యంత సంచలనంగా మారింది. రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే తాను పోలీసుల వైపు కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ అంగీకరించినట్లు సమాచారం. ఈ కాల్పుల ఉదంతంపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.

Continues below advertisement

చంచల్‌గూడ జైలుకు నిందితుల తరలింపుఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 11 మందిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా 8 మందికి నోటీసులు ఇచ్చి పంపిన పోలీసులు, గన్ ఫైరింగ్, డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై రోహిత్ రెడ్డి బృందాన్ని జడ్జి ముందు హాజరుపరిచారు. నిందితుల తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వారి పిటిషన్లను తిరస్కరించారు. ముగ్గురు నిందితులను 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాల కోసం పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు..మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ, కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు సోదాలకు వచ్చిన సమయంలో కాల్పులు జరిగినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో రోహిత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంటూ, మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Continues below advertisement

శనివారం రాత్రి జరిగిన ఈ సోదాల్లో పోలీసులు గోడలు దూకి లోపలికి వెళ్తుండగా, నిందితుడు నమిత్ శర్మ పోలీసులపైకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనా స్థలంలో జర్మన్ మేడ్ తుపాకీ, లైవ్ తూటాలు, ఖాళీ షెల్స్‌తో పాటు 0.26 గ్రాముల కొకైన్, భారీగా విదేశీ మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా.. రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మ, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిలతో పాటు టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌కు కూడా డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. ఆదివారం రాత్రి నిందితులను జడ్జి ముందు ప్రవేశపెట్టగా, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎంపీ పుట్టా మహేష్ సహా 8 మందికి స్టేషన్ బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.

పార్టీకి హాజరైంది వీరే..మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని తన ఫామ్‌హౌస్‌లో రోహిత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌, రోహిత్‌రెడ్డి సోదరుడు రితేశ్‌రెడ్డి, మణికొండకు చెందిన వ్యాపారులు మొరవినేని రమేశ్‌, వరమాచినేని శ్రవణ్‌కుమార్‌, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్‌శర్మ, అమీర్‌పేటకు చెందిన నల్లపనేని విజయకృష్ణ,  బెంగళూరుకు చెందిన లాయర్ కౌశిక్‌ రవి, పుప్పాలగూడకు చెందిన అర్జున్‌రెడ్డి(33), వికారాబాద్‌ జిల్లాకు చెందిన సిలివేరు శరత్‌కుమార్‌, ఫిల్మ్‌నగర్‌కు చెందిన ఆర్‌.ప్రియాంకా రెడ్డి హాజురయ్యారని పోలీసులు తెలిపారు.  

ప్రధాన నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి..ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు 11 మంది నిందితుల్ని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతో కాల్పులు జరిపినట్లు తేలడంతో మాజీ ఎమ్మెల్యేను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. లైసెన్స్ గన్ దుర్వినియోగం చేసినందుకు రితేష్ రెడ్డి, కాల్పులు జరిపినందుకు నమిత్ శర్మలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ సహా 8 మందికి నోటీసులు ఇచ్చి పంపారు. తెలంగాణ ఎక్సైజ్‌ చట్టంతో పాటు ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని 8సి, 22ఎ, 27, 29 సెక్షన్ల కింద, ఆయుధాల చట్టంలోని సెక్షన్‌ 30, 25(1బి)(ఎ),  కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.