Explosion at BJP office in Chandigarh: చండీగఢ్‌లోని సెక్టార్-37లో ఉన్న పంజాబ్ బీజేపీ కార్యాలయం వెలుపల బుధవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. సాయంత్రం 5 గంటల సమయంలో కార్యాలయానికి ఆనుకుని ఉన్న బ్లడ్ బ్యాంక్ భవనం వద్ద నిలిపి ఉంచిన ఒక యాక్టివా స్కూటీలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి స్కూటీ హెడ్‌లైట్ కింది భాగం తునాతునకలవ్వడమే కాకుండా, అందులోని కొన్ని పదునైన  వస్తువులు ఎదురుగా ఉన్న గోడకు బలంగా తగిలాయి. ఈ శబ్దం చాలా దూరం వరకు వినిపించడంతో స్థానికులు,పార్టీ కార్యకర్తలు భయాందోళనలకు గురయ్యారు.

Continues below advertisement

ఘటన జరిగిన వెంటనే చండీగఢ్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కన్వర్దీప్ కౌర్ నేతృత్వంలో భారీ పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా బీజేపీ కార్యాలయ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని   దిగ్బంధించారు. ఘటనా స్థలానికి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందాన్ని కూడా పిలిపించారు. ప్రాథమికంగా ఇది తక్కువ తీవ్రత కలిగిన పేలుడు  అని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఇది స్కూటీ బ్యాటరీ పేలుడా లేక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్నది నిర్ధారించాల్సి ఉంది.

పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశ్విని శర్మ ఈ ఘటనపై స్పందించారు.  పేలుడు జరిగిన సమయంలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాంబు స్క్వాడ్ ,  డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఏదైనా రసాయన పదార్థం వల్ల ఈ పేలుడు జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, కానీ పార్టీ కార్యాలయం వద్ద భద్రతను ఒక్కసారిగా పెంచారు.             

Continues below advertisement

  బీజేపీ కార్యాలయం వద్ద ఇలాంటి ఘటన జరగడంతో భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. కేవలం స్కూటీ యజమానిని గుర్తించడమే కాకుండా, గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పంజాబ్ ,  చండీగఢ్ మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ పేలుడు వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉందేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. త్వరలోనే ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.