Sand Storm Hits Mumbai: ముంబయిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సిటీని ఇసుక తుఫాన్ (Sand Storm in Mumbai) చుట్టుముట్టింది. మధ్యాహ్నం 3 గంటలకు నగరమంతా చల్లబడింది. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించింది. అయితే..ఇసుక తుఫాను ముంచెత్తడం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రోడ్లపైన ఉన్న వాళ్లంతా ఈ తుఫాన్ నుంచి తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. ఘట్కోపర్, బాంద్రా కుర్లా, ధారావి ప్రాంతల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ ఎఫెక్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌లో కొన్ని విమానాలు టేకాఫ్ కాకుండా నిలిచిపోయాయి. ఫ్లైట్ సర్వీస్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ చెప్పేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ఘట్కోపర్‌లో చెద్దానగర్ జంక్షన్ వద్ద 100 అడుగుల బిల్‌బోర్డ్ ఈ ఇసుక తుఫాను ధాటికి కుప్ప కూలిపోయింది. కింద ఉన్న పెట్రోల్ బంక్‌పై పడిపోయింది.
ఈ బోర్డ్ కింద పలువురు వాహనదారులు చిక్కుకుపోయారు. వాళ్లంతా చనిపోయారంటూ స్థానికులు పెద్దగా కేకలు వేశారు. అయితే...ఇప్పటి వరకూ అధికారులు మాత్రం ప్రాణనష్టం జరిగినట్టు వెల్లడించలేదు. చిక్కుకున్న వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. సోషల్ మీడియాలో ఈ తుఫాన్‌కి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
IMD అంచనాల ప్రకారం మహారాష్ట్రలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని IMD వెల్లడించింది. పలు చోట్ల మెట్రో సర్వీస్‌లూ నిలిచిపోయాయి. పలు స్టేషన్‌ల వద్ద ఎలక్ట్రిక్ వైర్‌లపై బ్యానర్‌లు పడిపోయాయి. పలు చోట్ల రోడ్లపైన చెట్లు కూలిపోవడం వల్ల ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలిగింది.