నువ్వు - నేను అనే సినిమాలో హీరో ఉదయ్ కిరణ్ తండ్రి ... తనతో సహజీవనం చేస్తున్న మహిళ కూతురితో ఉదయ్‌కిరణ్‌కు పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే ఆ బైక్ రేసర్ జీవితంలో అలాంటిది జరగలేదు కానీ.. తానే కోరుకుని మరీ అలాంటి పెళ్లి చేసుకున్నాడు.
 
పోర్చ్‌గీస్ మోటోజీపీ రేసర్ మిగువెల్ ఓలివెరా తన స్టెప్ సిస్టర్ ను పెళ్లి చేసుకున్నారు. అంతే కాదు ఓ బిడ్డను తండ్రవబోతున్నాడు. వీళ్లది ఇప్పటి ప్రేమ కాదు.. పదకొండేళ్లనాటిది. ప్రపంచం ఏమనుకుంటుందో అని పదకొండేళ్ల పాటు వీరు తమ బంధాన్ని గుట్టుగా ఉంచుకున్నారు. కానీ ఎంతోకాలం అలా ఉంచుకోలేమని గత ఏడాది తెలుసుకుని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి కారణం ఉంది. ఇప్పుడు బైక్ రేసర్ ఒలివెరా పెళ్లి చేసుకున్న తన స్టెప్ సిస్టర్ ఆండ్రియా ఇప్పుడు ప్రెగ్నెంట్. అందుకే ప్రపంచానికి తమ పెళ్లి వార్త గురించి బయట పెట్టారు.


ఒలివెరా తండ్రి పదమూడేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఒలివెరా వయసు పదమూడేళ్లు. ఆయన పెళ్లి చేసుకున్న మహిళకుకూడా రెండో పెళ్లే. ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తే ఆండ్రియా. ఒలివెరా తండ్రి, ఆండ్రియా తల్లి భార్య భర్తలు. వీరిద్దరూ అలా స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్ అయ్యారు.  కానీ వీరి మధ్య వాస్తవికంగా రక్త సంబంధం లేదు. వాళ్ల తల్లిదండ్రులు .. భార్యభర్తలుగా మారడంతో వారంతా ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారు. ఈ సమయంలో ఒలివెరా, ఆండ్రియా మధ్య కూడా ప్రేమ చిగురించింది. పదకొండేళ్లుగా వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకుంటూనే ఉన్నారు. అయితే ప్రపంచానికి వారి బంధం తప్పుగా అర్థమవుతుందని అనుకున్నారేమో సీక్రెట్‌గా ఉంచారు. మోటో జీపీలో రేసర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఒలివెరా.. ఇప్పుడు ఎవరేమనుకుంటే తనకేంటి అని అనుకున్నారేమో కానీ.. తన నిర్ణయాన్ని ప్రకటించారు. గత ఏడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది ఓ బిడ్డను తమ కుటుంబంలోకి ఆహ్వానించాలని అనుకున్నారు. అందుకే పెళ్లి కూడా చేసుకున్నారు. తమ ఫోటోలను ఆ జంట సోషల్ మీడియాలో ఆనందంగా షేర్ చేసుకున్నారు.


విదేశాల్లో బహుళ పెళ్లిళ్లు సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. అయితే స్టెప్ బ్రదర్, స్టెప్ సిస్టర్‌ల మధ్య పెళ్లిళ్లు మాత్రం అనూహ్యమే. అదీ కూడా ఓ సెలబ్రిటీ ఇలా చేస్తున్నారంటే కాస్త విచిత్రంగానూ ఉంటుంది. అందుకే ఇంటర్నేషనల్ మీడియా వీరి పెళ్లికి మంచి పబ్లిసిటీ ఇస్తోంది. అయితే ఎవరేమనుకున్నా.. తమ ప్రేమ ముందు అంతా డోంట్ కేర్ అనుకున్న జంట .. తమ ఇష్ట ప్రకారం జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇలా పెళ్లి చేసుకున్న వారిలో ఒలివెరా, ఆండ్రియా జంటనే మొదటి వాళ్లు కాదు పలువురు హాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ జాబితాలో ఉన్నారు.