ఆంధ్రప్రదేశ్‌లో అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్లను పరిశీలిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సమాచారం ఇచ్చారు. ఈ నెల ఆరో తేదీన రఘురామకృష్ణరాజు మన్సుఖ్ మాండవీయకు ఏపీలో అమ్ముతున్న లిక్కర్ బ్రాండ్లు నాసిరకమైనవని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. " ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం మద్యం ముప్పు పెరిగిపోయిందని, కొన్ని బ్రాండ్లు, డిస్టిలరీలు తయారు చేస్తున్న ఇలాంటి మద్యం సేవించి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని" రఘురామ కృష్ణరాజు లేఖలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.  


రోజువారీ కూలీపనులు చేసుకునే పేదలు ఎక్కువగా నాసిరకం మద్యం తాగుతున్నారని ఈ నాణ్యత లేని  మద్యం వల్ల భవన కార్మికులు,ఇతర పనులు చేసుకునే వారి పై తీవ్ర ప్రభావం పడుతోందని రఘురామ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మద్యం విక్రయాలపై కేంద్రఆరోగ్య శాఖ నిపుణుల తో కమిటీ ఏర్పాటు చేయాలని లేఖలో రఘురామ కోరారు. నాణ్యతలేని మద్యం నమూనాలను వివిధ ప్రాంతాల నుంచి సేకరించి దాన్ని తాగితే మధ్య మరియు దిగువ తరగతి ప్రజల ఆరోగ్యాల పై కలిగే అనారోగ్యాల పై అధ్యయనం చేయించాలని అప్పటి లేఖలో రఘురాకృష్ణరాజు సూచించారు. తన లేఖపై త్వరగా స్పందించాలని కూడా కోరారు. ఈ వ్యవహరంపై కాలయాపన చేస్తే ప్రజల ప్రాణాలకు హానీ కలిగే అవకాశం ఉంటుందన్నారు.


ఆరో తేదీన రాసిన లేఖపై కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ స్పందించారు. లేఖ అందిందని అందులోని అంశాలపై పరిశీలన జరిపి.. వివరాలను తెలియజేస్తామని మాండవీయ ఎంపీకి తెలియచేశారు. అయితే ఇది విచారణ జరిపించడానికి సిద్ధపడినట్లుగా కాదని భావిస్తున్నారు.  ప్రతి కేంద్రమంత్రి తమకు వచ్చే లేఖలు అందినట్లుగా పంపిన వారికి.. విజ్ఞప్తి చేసిన వారికి అక్నాలెడ్జ్‌మెంట్ పంపుతారు. అలా రఘురామకు కూడా లెటర్ అందినట్లుగా కేంద్రమంత్రిగా లేఖ పంపారు. అందులోని అంశాలను పరిశీలిస్తామని హమీ ఇచ్చారు. ఈ అంశంపై ఎప్పట్లోపు పరిశీలన చేస్తారో స్పష్టత లేదు. 


ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విధానం మార్చారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్ముతున్నారు. అయితే ప్రసిద్ధి చెందిన బ్రాండ్లు ఏవీ అమ్మడం లేదు. "ఫర్ సేల్ ఓన్ల ఏపీ"కి పర్మిషన్ ఉన్న బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు. అవీ కూడా రకరకాల కంపెనీల పేర్లతో ఉంటున్నాయి. ఇవన్నీ నాసిరకమైన మద్యం అని.. వాటిని అత్యధిక ధరకు అమ్ముతున్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. మద్యం ఆదాయాన్ని తనఖా పెట్టి రుణాలు తీసుకోవడంపైనా విమర్శలు చేస్తున్నారు.