Manish Sisodia CBI Remand:
5 రోజుల కస్టడీ..
ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది సీబీఐ. సిసోడియాకు 5 రోజుల రిమాండ్ ఇవ్వాలని కోర్టుని కోరింది. లిక్కర్ పాలసీలో కచ్చితంగా స్కామ్ జరిగిందని, అది కూడా చాలా సైలెంట్‌గా, ప్లాన్డ్‌గా చేశారని తేల్చి చెప్పింది. అంతే కాదు. సిసోడియాను A-1గా వెల్లడించింది. 5 రోజుల పాటు ఆయన CBI కస్టడీలోనే ఉండనున్నారు. మార్చి 4వ తేదీ వరకూ కస్టడీలోనే ఉంటారని స్పష్టం చేశారు అధికారులు
"సిసోడియా కంప్యూటర్‌లో కొన్ని కీలక ఆధారాలు లభించాయి. కొందరి మంత్రుల నుంచి సిసోడియాకు నోట్‌లు వచ్చాయి. కమీషన్ ఉన్నట్టుండి 5 కోట్ల నుంచి 12 కోట్లకు పెంచేశారు. ఒకవేళ ఈ పాలసీ నిజంగానే పారదర్శకంగా ఉండి ఉంటే కచ్చితంగా అమలు చేసే వాళ్లు. Indo Spirit అనే కంపెనీ సిసోడియా వల్ల లబ్ధి పొందింది. ఈ కేసులో తప్పకుండా ఫేస్ టు ఫేస్ ఇంటరాగేషన్ జరిపి తీరాలి. ఆయన ఫోన్‌లు కూడా పదేపదే మార్చారు. ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించారు. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకూ సిసోడియా వాడిన ఫోన్‌లను మేం పరిశీలించాలి."
-సీబీఐ
లాయర్ వాదన ఇది..
అయితే సీబీఐ వాదనల్ని సిసోడియా తరపున వాదించే న్యాయవాది దయన్ కృష్ణన్ కొట్టి పారేశారు. రిమాండ్ అడగడానికి సీబీఐకి కచ్చితమైన కారణమేమీ లేదని అన్నారు. ఓ వ్యక్తి సమాధానం చెప్పనంత మాత్రాన అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. రిమాండ్ పిటిషన్‌ను ఖండించారు. ఫోన్‌లు మార్చడం పెద్ద నేరమేమీ కాదని తేల్చి చెప్పారు. సిసోడియా వాడిన 4 ఫోన్లలో 3 మొబైల్స్‌ను నిర్వీర్యం చేశారని సీబీఐ వాదిస్తోందన్న దయన్ కృష్ణన్...పదేపదే ఇదే అంశాన్ని ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. గతేడాది ఆగస్టు 17వ తేదీన సీబీఐ అధికారులు సిసోడియా ఇంట్లో సోదాలు జరిపారని, సెప్టెంబర్ 1న ఆయన తన ఫోన్‌ను అధికారులకు అందించారని వివరించారు. విచారణకు సహకరించారనడానికి ఇదే నిదర్శనమని వాదించారు. సీబీఐ విచారణకు సిసోడియా పూర్తిగా సహకరించారని వెల్లడించారు. లిక్కర్ పాలసీలోని మార్పులు చేర్పులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆమోద ముద్ర వేశారని గుర్తు చేశారు.