Tripura CM Manik Saha:
రెండోసారి సీఎంగా..
త్రిపుర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు మాణిక్ సాహా. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అగర్తలాలోని వివేకానంద మైదాన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. మాణిక్ సాహాతో పాటు పలువురు మంత్రులూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆరేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాణిక్ సాహాకు ప్రాధాన్యత ఇచ్చింది అధిష్ఠానం. 2022లో అప్పటి వరకూ సీఎంగా ఉన్న విప్లవ్ దేవ్‌ను పక్కన పెట్టి ఉన్నట్టుండి మాణిక్ సాహాకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పజెప్పింది బీజేపీ. ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. 2016లో బీజేపీలో చేరారు మాణిక్ సాహా. 2018 ఎన్నికల్లో గెలుస్తామని బీజేపీ కూడా ఊహించలేదు. అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ విప్లవ్ దేవ్‌ను సీఎంగా ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు మాణిక్ సాహా. ఆయన సేవల్ని గుర్తించిన అధిష్ఠానం 2020లో రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించింది. పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు సాహా. ఆ తరవాత 2022లో విప్లవ్ శర్మ పాలనపై ప్రజల్లో అసంతృప్తి మొదలైంది. వెంటనే అప్రమత్తమైన బీజేపీ...అప్పటికే ప్రజాదరణ పొందిన సాహాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేకపోవడం వల్ల సాహా నేతృత్వంలోని బీజేపీ మరోసారి విజయం సాధించింది.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాత మాణిక్ సాహా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచినందుకు థాంక్స్ చెప్పారు.
"ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నా కృతజ్ఞతలు. నాపై ఎంతో నమ్మకం ఉంచారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు కార్యకర్తల కృషి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. "
- మాణిక్ సాహా, త్రిపుర ముఖ్యమంత్రి