Akilesh Comments On Temple : " ఓ రాయి, ఎర్ర జెండా వాటిని రావి చెట్టు కింద ఉంచితే చాలు గుడి రెడీ అయిపోయినట్లే..." సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలు చేస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న అఖిలేష్.. తాజాగా ఆలయాల వివాదంపై స్పందించారు. ఇటీవల కాలంలో జ్ఞానవాపి మసీదు అంశం హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ శివలింగం బయటపడిన అంశం కూడా చర్చనీయాంశమవుతోంది. వీటిని రాజకీయ కోణంలో అఖిలేష్ యాదవ్ విశ్లేషించినట్లుగా కనిపిస్తోంది.
మసీదు, ఆలయాల పేరుతో భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసి.. ప్రజల మధ్య విభజన రేఖ గీస్తోందని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న ధరలు, ద్రవోల్బణం వంటి వాటిపై మాట్లాడేందుకు బీజేపీ సిద్ధంగా లేదన్నారు. ఈ పరిణామాలన్నింటికీ బీజేపీ, ఆరెస్సెస్‌దే బాధ్యత అని.. అసలు కుట్రంతా అవే చేస్తున్నాయని అఖిలేష్ ఆరోపించారు.
యూపీలోని సిద్ధార్థనగర్ లో ఇటీవల ఓ ముస్లిం మహిళను కొంత మంది కొట్టి చంపారు. ఈ ఘటనపై అఖిలేష్ యాదవ్ హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ హత్య అంశాన్ని లేవనెత్తుతానని ప్రకటించారు. గోవుల్ని వధిస్తున్నారన్న ఆరోపణలపై సిద్ధార్ధనగర్ లో దాడులు నిర్వహించిన సమయంలోనే మహిళ దాడికి గురయ్యారు. అందుకే పోలీసులే ఆ మహిళను చంపారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. చందోలిలో ఇటీవల ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు కథ అల్లారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు. యూపీలో పోలీస్ ఫేక్ ఎన్ కౌంటర్స్, కస్టడీ మరణాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ... అధికారం చేజిక్కించుకోలేకపోయారు. భారతీయ జనతా పార్టీ మత వ్యూహంతోనే అధికారం నిలబెట్టుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవలి కాలంలో యూపీలో పెద్ద ఎత్తున మతపరమైన ఘటనలు జరుగుతున్నాయని..పోలీసులు కూడా బాధితులకు అండగా ఉండటం లేదని అంటున్నారు. ఏదో ఓ వివాదం తెరమీదకు వస్తూండటంతో ఆయన ఆలయాలపై వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. అఖిలేష్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరోసారి యూపీలో మత పరమైన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.