Crime on New Year : దేశమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతుండగా లక్నో హోటల్‌లో దారుణం చోటుచేసుకుంది. హోటల్ గదిలో ఓ మహిళ, ఆమె నలుగురు కుమార్తెలు హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. ఓ యువకుడు హోటల్ గదిలో తన తల్లి, నలుగురు సోదరీమణులను దారుణంగా హత్య చేశాడు. వారికి మద్యం తాగించి, భోజనంలో మత్తు పదార్థాలు కలిపి.. మత్తులో ఉన్న సమయంలో వారిని చంపేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
తీవ్ర రక్తస్రావంతో మృతి
ముందుగా ఈ ఐదుగురి చేతి మణికట్టులను కోశాడని, ఆ తర్వాత వారు తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాని ప్రాథమిక విచారణలో తేలినట్టు అధికారులు చెబుతున్నారు. నిందితుడిని 24 ఏళ్ల అర్షద్‌గా గుర్తించారు. మృతుల్లో తల్లి అస్మాతో పాటు ఆమె కూతుళ్లు అలియా (9 ఏళ్లు), అల్షియా (19 ఏళ్లు), అక్సా (16 ఏళ్లు), రెహ్మిన్ (18 ఏళ్లు) ఉన్నారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే కొంత మంది కుటుంబ సభ్యులను గొంతు నులిమి హత్య చేయగా, మిగిలిన వారిని బ్లేడుతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బబ్లూ కుమార్.. "తల్లి, నలుగురు అమ్మాయిలతో కలిపి మొత్తం ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు డిసెంబర్ 30న ఇక్కడకు వచ్చారని, ఆ సమయంలో వారి సోదరుడు, తండ్రి కూడా ఉన్నారని హోటల్ సిబ్బంది చెప్పారు. అసలు విషయం ఏమిటన్న దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాం" అని వెల్లడించారు. నిందితుడిని సంఘటనా స్థలంలోఅరెస్టు చేసి సమగ్ర విచారణ జరిపి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. హోటల్ సిబ్బంది ప్రకారం సోదరుడితో పాటు తండ్రి కూడా వారితోనే ఉండి ఉండాలి. కానీ ప్రస్తుతం అతను పరారీలో ఉండడంతో అతన్ని కూడా పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్నారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
మృతదేహాలను ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించామని సెంట్రల్ లక్నో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) రవీనా త్యాగి తెలిపారు. హత్యకు ముందు వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. విచారణ పూర్తయిన తర్వాత హంతకుడి ఉద్దేశ్యంపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధానిలోని నాకా ప్రాంతంలోని హోటల్ శరంజిత్‌లో ఈ ఘటన జరిగిందన్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆ యువకుతు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఆమె తెలిపారు. సాక్ష్యాలను సేకరించడానికి ఫోరెన్సిక్ బృందాలతో కలిసి ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు.
బాధితులకు అండగా సమాజ్ వాదీ పార్టీ
ఈ ఐదుగురి హత్యకు నిరుద్యోగం, ఒత్తిడి, పేదరికం కారణం కావచ్చని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఫఖ్రుల్ హసన్ చంద్ అభిప్రాయపడ్డారు. తమ పార్టీ బాధితులకు అండగా నిలుస్తుందని చెప్పారు. వారి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు.