Man attends Gujarat High Court hearing from toilet : గుజరాత్ హైకోర్టులో జూన్ 20, 2025న జరిగిన వర్చువల్ విచారణ సందర్భంగా  ఒక వ్యక్తి టాయిలెట్ సీట్‌పై కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన జస్టిస్ నిర్జర్ ఎస్. దేశాయ్ బెంచ్ ముందు జరిగింది.

గుజరాత్ హైకోర్టులో జస్టిస్ నిర్జర్ ఎస్. దేశాయ్   చెక్ బౌన్స్‌ కేసును విచారణ చేపట్టారు.  ఈ వ్యక్తి ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉండి, FIR రద్దు చేయడానికి సంబంధించిన పిటిషన్‌లో ప్రతివాదిగా హాజరయ్యాడు. వీడియోలో, 'సమద్ బ్యాటరీ' అనే పేరుతో లాగిన్ అయిన ఈ వ్యక్తి మొదట బ్లూటూత్ ఇయర్‌ ఫోన్ ధరించి కనిపించాడు. అతను తన ఫోన్‌ను కొంత దూరంలో ఉంచడంతో, అతను టాయిలెట్ సీట్‌పై కూర్చొని ఉన్నట్లు స్పష్టమైంది. వీడియోలో అతను తనను తాను శుభ్రం చేసుకుంటూ, ఫ్లష్ ఉపయోగించి, ఆ తర్వాత టాయిలెట్ నుండి బయటకు వెళ్లి మరొక గదిలో తిరిగి కనిపించాడు.  

ఈ ఒక నిమిషం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని అగౌరవపరిచారని నెటిజన్లు మండిపడ్డారు. ఈ కేసులో ఇరు పక్షాల మధ్య సామరస్యపూర్వక ఒప్పందం కుదిరినందున, గుజరాత్ హైకోర్టు FIRని రద్దు చేసింది. కానీ ఇతను టాయిలెట్ నుంచి హాజరైనందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

2025 ఏప్రిల్‌లో ఒక వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ సమయంలో సిగరెట్ తాగుతూ కనిపించడంతో, గుజరాత్ హైకోర్టు అతనిపై రూ.50,000 జరిమానా విధించింది. 2025 మార్చి‌లో  ధవల్ పటేల్ అనే వ్యక్తి టాయిలెట్ నుండి విచారణకు హాజరైనందుకు రూ. 2 లక్షల జరిమానా, రెండు వారాల పాటు కమ్యూనిటీ సర్వీస్‌ను విధించారు. 2025 ఫిబ్రవరిలో వమ్దేవ్ గఢ్వీ అనే వ్యక్తి మంచం మీద పడుకొని విచారణకు హాజరైనందుకు రూ.  25,000 జరిమానా విధించారు.  

ఇలాంటి ఘటనలు జరుగుతున్నందున వర్చువల్ విచారణలు రద్దు చేయాలన్న డిమాండ్లు నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.