ఉట్నూర్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను అమలు కాకుండా చూస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ లోని ఐటీడీఏ మీటింగ్ హాల్ లో గిరిజన పెద్దలు, అధికారులతో మంత్రి జూపల్లి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజనులను ఇబ్బందులకు గురిచేసే జీవో 49ను పూర్తిగా రద్దు చేయాలని ఎమ్మెల్యే లు, గిరిజన పెద్దలు డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ..ఆ 49 జీవోకు సంబంధించి ప్రభుత్వం ఇంకా గెజిట్ విడుదల చేయలేదని.. ఈ విషయం అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారని గుర్తు చేశారు. ఇదే సందర్భంలో ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ఇప్పటికే గెజిట్ విడుదల చేసిందని చెప్పారు. వెంటనే స్పందించిన మంత్రి అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ డా. సువర్ణతో ఫోన్ లో మాట్లాడి అందరికి వినిపించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గిరిజనులకు అన్యాయం చేసే ఏ పని ప్రభుత్వం చేయదని చెప్పారు. గిరిజనుల హక్కులు వాపస్ తీసుకోదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సదరు 49జీవోను నిలుపుదల చేసేందుకు ఎంత వరకైనా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మీ, హరీష్ బాబు, కలెక్టర్లు రాజర్శి షా, వెంకటేష్ దొత్రే, ఐటీడీఏ పీఓ కుష్బు గుప్తా, స్పెషల్, ఎస్పీ లు అఖిల్ మహాజన్, క్రాంతి లాల్ పాటిల్, డిఎఫ్ఓ లు ప్రశాంత్ భాజీరావు పాటిల్, నీరజ్ కుమార్ టిబ్రెవాల్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేశారు. అవుట్ పేషెంట్, ఎమర్జెన్సీ విభాగాలతో పాటు పలు వార్డులను పరిశీలించారు. వాటర్ లీకేజీ, ఆపరిశుభ్రత వాతావరణాన్ని చూసి వైద్యాధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హాస్పిటల్ నిర్వహణ సరిగా లేదని, ఇలాంటి వాతావరణం ఉంటే సామాన్య రోగులు ఎలా వస్తారని ప్రశ్నించారు. సౌకర్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. శానిటేషన్ కాంట్రాక్టర్ ను మందలించారు.
అంతకుముందు ఆసుపత్రిలో బెడ్ ల వివరాలు, ఓపి రోజువారీ వివరాలు, సిబ్బంది, డాక్టర్ల సంఖ్యపై ఆరా తీశారు. అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ..ఆదిలాబాద్ జిల్లాలో వైద్య సేవలు మరింత మెరుగుపరుస్తామని, వైద్యుల భర్తీతో పాటు తగినన్ని నిధుల మంజూరుకు కృషిచేస్తానని అన్నారు.