Niti Aayog Meet: నీతి ఆయోగ్ సమావేశం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇండీ కూటమికి చెందిన నేతలు కొందరు ఈ భేటిని బైకాట్ చేశారు. ఈ సమావేశానికి హాజరైన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్యలోనే వాకౌట్ చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో మధ్యలోనే బయటకు వచ్చేశారు. బీజేపీయేతర రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని మండి పడ్డారు. దీనిపై నినదించినందుకే సమావేశంలో తనను మాట్లాడనివ్వలేదని ఆరోపించారు. మైక్‌ ఆఫ్ చేశారని విమర్శించారు. కనీసం 5 నిముషాలు కూడా మాట్లాడకుండానే అడ్డుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ తీరు నచ్చకే  బయటకు వచ్చేసినట్టు స్పష్టం చేశారు. బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌ ఎలాంటి కేటాయింపులు లేకుండా అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష  చూపించడం సరికాదు. సమావేశంలో నేను మాట్లాడాలని అనుకున్నాను. కానీ నాకు 5 నిముషాలు మాత్రమే సమయం ఇచ్చారు. ఆ తరవాత మైక్ ఆఫ్ చేశారు. నా ముందు నేతలంతా 10-20 నిముషాలు మాట్లాడారు. ప్రతిపక్షం నుంచి ఈ సమావేశానికి హాజరైంది నేను మాత్రమే. అయినా నన్ను మాట్లాడనివ్వకుండా అవమానించారు"


- మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి






మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి మైక్ ఆఫ్ చేశారని ఆరోపించారు మమతా బెనర్జీ. ఎందుకిలా చేశారని అడిగినా ఎవరూ సమాధానం చెప్పలేదని మండి పడ్డారు. ఎందుకింత వివక్ష చూపిస్తున్నారంటూ ప్రశ్నించారు. తాను సమావేశానికి హాజరైనందుకు ఆనందించాల్సింది పోయి ఇలా ప్రవర్తిస్తారా అని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం నుంచి వచ్చిన ఒకే ఒక నేత గొంతుని ఎందుకు అణిచివేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇది బెంగాల్‌కే కాకుండా స్థానిక పార్టీలకే ఘోర అవమానం అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎలాంటి నిధులు ఇవ్వలేదని విమర్శించారు. నీతి ఆయోగ్‌ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మమతా బెనర్జీ. అంతకు ముందు ఉన్న ప్లానింగ్ కమిషన్‌ని మళ్లీ తీసుకురావాలని అన్నారు. నీతి ఆయోగ్‌కి ఆర్థిక పరంగా ఎలాంటి అధికారాలు లేవని, అసలు అది ఎలా పని చేస్తుందో అర్థం కావడం లేదని విమర్శించారు. నీతి ఆయోగ్‌కి అధికారాలు ఇవ్వడమా లేదంటే ప్లానింగ్ కమిషన్‌ని మళ్లీ తీసుకురావడమా అన్నది కేంద్రం ఆలోచించాలని సూచించారు. 






Also Read: Viral Video: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?