ABP  WhatsApp

Mamata on Pegasus: ఫోన్ కు ప్లాస్టర్ వేశా.. 2024లో భాజపాకు వేస్తా: దీదీ

ABP Desam Updated at: 21 Jul 2021 06:33 PM (IST)

పెగాసస్ వ్యవహారంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. భారత్ ను సంక్షేమ రాజ్యంగా మార్చడానికి బదులు నిఘా రాజ్యంగా మారుస్తున్నారని మోదీపై విరుచుకుపడ్డారు.

Didi_Modi

NEXT PREV

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోన్న 'పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారం'పై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య భారత్‌ను మోదీ సర్కారు నిఘా దేశంగా తయారు చేయాలనుకుంటుందని విమర్శించారు. పెగాసస్‌కు భయపడి తన ఫోన్‌కు ప్లాస్టర్‌ వేసుకున్నానని దీదీ చెప్పారు. ప్రభుత్వ విపరీత చర్యలకు కూడా ప్లాస్టర్‌ వేయాలంటూ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. హ్యాకింగ్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. 



"ప్రజాస్వామ్య భారత దేశాన్ని సంక్షేమ రాజ్యంగా కాకుండా భాజపా సర్కారు నిఘా దేశంగా మార్చాలనుకుంటోంది. అందుకే పెట్రోల్‌, డీజిల్‌, ఇతర వస్తు, సేవల ద్వారా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తూ.. ఆ సొమ్ముతో సంక్షేమ పథకాలు చేపట్టకుండా.. వ్యక్తులపై నిఘా పెట్టేందుకు 'ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌'ను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తోంది. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్‌.. ప్రజాస్వామ్యానికి ప్రధానమైనవి. పెగాసస్‌ ఈ మూడింటిపైనా దాడిచేసింది. దేశాన్ని భాజపా చీకటిలోకి నెట్టేస్తోంది. ఈ చీకట్లను చీల్చుకుని కొత్త వెలుతురు తీసుకురావాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి"- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి


నిఘా పెడతారనే అలా చేశా..



"నా ఫోన్‌ను కూడా ట్యాపింగ్‌ చేస్తారని తెలుసు. ప్రతిపక్షనేతల ఫోన్లపై కేంద్రం నిఘా పెడుతుంది. అందుకే ఎన్సీసీ అధినేత శరద్‌ పవార్‌, ఇతర ప్రతిపక్ష నేతలు, ముఖ్యమంత్రులతో నేను ఫోన్లలో మాట్లాడలేకపోతున్నా.పెగాసస్‌కు భయపడి నా ఫోన్‌కు ప్లాస్టర్‌ వేసుకున్నా. అయితే ఈ హ్యాకింగ్‌ వంటివేవీ వారిని రక్షించలేవు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రభుత్వానికి కూడా ప్లాస్టర్‌ వేయాలి. ఇందుకోసం ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి. త్వరలో నేను దిల్లీ వెళ్లి ప్రతిపక్ష నేతలను కలుస్తా"- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి


హ్యాకింగ్‌ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకోవాలని మమత ఈ సందర్భంగా కోరారు. ‘ఇంతమంది ఫోన్లపై నిఘా పెట్టారని తెలిసి ఈ కేసును ఎందుకు సుమోటోగా విచారించకూడదని ఆమె ప్రశ్నించారు. కేవలం న్యాయవ్యవస్థ ఒక్కటే దేశాన్ని కాపాడగలదని దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. 


సంచలనం సృష్టిస్తోన్న హ్యాకింగ్ వ్యవహారానికి సంబంధించి స్పైవేర్‌ లక్షిత జాబితాలో రాహుల్‌ గాంధీ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతల ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు తెలిసింది. మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, బంగాల్‌ ఎన్నికల్లో దీదీకి విజయం అందించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఫోన్లపైనా హ్యాకింగ్‌ జరిగినట్లు ది వైర్‌ వార్తా సంస్థ కథనం వెల్లడించింది.

Published at: 21 Jul 2021 06:33 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.