Karnataka CM Race:


కార్యకర్తల కొత్త డిమాండ్..


కర్ణాటక సీఎం రేసులో ఇప్పటి వరకూ డీకే శివకుమార్, సిద్దరామయ్య పేర్లు మాత్రమే వినిపించాయి. కానీ...ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయనే మల్లికార్జున్ ఖర్గే. అవును. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని (Mallikarjun Kharge) కూడా ఈ రేసులోకి లాగారు కొందరు కార్యకర్తలు. బెంగళూరులోని పార్టీ ఆఫీస్ బయట కొందరు ఖర్గేకి మద్దతుగా నినాదాలు చేశారు. మల్లికార్జున్ ఖర్గేనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. "ఇప్పటి వరకూ కర్ణాటకలో ఓ దళితుడు ముఖ్యమంత్రి అవ్వలేదు. అందుకే ఖర్గేకు ఆ అవకాశమివ్వాలి" అంటూ తమ వాదనలు వినిపించారు. ఓ వైపు ఖర్గే, రాహుల్‌తో డీకే శివకుమార్, సిద్దరామయ్య వరుస భేటీలతో బిజీబిజీగా ఉండగా...వీళ్లు కొత్త డిమాండ్‌ తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికే...సీఎం ఎవరన్నది ఓ క్లారిటీ వచ్చినట్టే ఉంది. సిద్దరామయ్యకే హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డీకే శివకుమార్‌కి డిప్యుటీ సీఎంతో పాటు మరి కొన్ని కీలక శాఖలు కట్టబెట్టే అవకాశాలున్నాయి. అయితే...ఇవన్నీ ఊహాగానాలేనా..? లేదా నిజంగానే హైకమాండ్‌ నిర్ణయం తీసుకుందా అన్నది అధికారికంగా ప్రకటన వచ్చేంత వరకూ ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం..డీకే శివ కుమార్‌తో సోనియా గాంధీ భేటీ అయినట్టు తెలుస్తోంది. సీఎం పదవిని ఇవ్వకపోవడానికి కారణాలేంటో ఆమె వివరించారట. అంతే కాదు. ఆయనను కన్విన్స్ చేయడంతో పాటు పార్టీ కోసం పడిన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందని భరోసా ఇచ్చినట్టూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.