Amaravati Supreme Court : అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో సెంటు స్థలాల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం చేస్తున్న పట్టాల పంపిణీ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అంశంపై విచారణలో ఉన్న పిటిషన్లపై వచ్చే తీర్పుకు లోబడి పట్టాల పంపిణీ ఉంటుందని స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించి ఆర్ 5 జోన్ ను ఏర్పాటు చేసి సెంటు పట్టాలను పంపిణీ చేస్తున్నారని అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో తాము పేదలకు పట్టాలు పంపిణీ చేసేశామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విచారణలో ఉండగా ఎలా సాధ్యమని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వాదనల తర్వాత సెంటు స్థలాల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోబోమన్న సుప్రీంకోర్టు.... భూయాజమాన్య హక్కులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ ప్రకారం పెట్టుబడులతో వచ్చే ఐటీ కంపెనీల కోసం కేటాయించిన ప్రాంతాన్ని విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ చట్టానికి ప్రభుత్వం సవరణ కూడా చేసింది. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల పరిధిలో ఉన్న 1,134 ఎకరాలను నివాస ప్రాంతంగా మార్చి ఆర్-5 జోన్‌గా పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది.
ఈ గెజిట్‌ను సవాల్ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అమరావతిలో ఇళ్ల స్థలాల అంశంపై ఏపీ ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో జీవో 107 జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీలు, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని మండలాలకు చెందిన పేదలందరికి ఇళ్లు పథకం పేరుతో.. రాజధాని కోసం సమీకరించిన 1251 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. జోనల్ రెగ్యులేషన్‌కు ఈ ఉత్తర్వులు విరుద్ధమని.. జోనల్ పరిధిని కుదించడమే అన్నారు. రాజకీయ అజెండాలో భాగంగా రాజధాని ప్రాంతానికి చెందనివారికి అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం సీఆర్‌డీఏ సవరణ చట్టం(యాక్ట్ 13) తీసుకొచ్చింది వాదిస్తున్నారు.
ఇప్పటికే దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం దగ్గర ఉన్నాయి. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేప్పుడు.. జీవో 107ను సవాల్ చేస్తూ దాఖలైన పాత కేసుకు కలపానలి ప్రభుత్వం కోరిందన్నారు. దీంతో అవన్నీ త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరాయని.. ఇప్పుడు దీనిని అవకాశంగా తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుత గెజిట్‌ను జారీ చేసింది అని పిటిషన్‌లో ప్రస్తావించారు. సీఆర్డీఏ స్థానిక ప్రజలు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదని అంటున్నారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.. కానీ స్థలాల కేటాయింపు తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులోనూ అమరావతి పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వాటిపై విచారణ జూలైలో జరగనుంది. ఈ సందర్భంగా వచ్చే తుది తీర్పును బట్టే అమరావతిలో సెంటు స్థలాలపై యాజమాన్య హక్కులు లబ్దిదారులకు వస్తాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.