Mallikarjun Kharge in Hyderabad: బీజేపీ బెదిరింపులకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరూ భయపడబోరని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. మోదీ - అమిత్ షాలు ప్రభుత్వాల్ని కూల్చి వేసే కుటిల ప్రయత్నాలు చేయబోతున్నారని హెచ్చరించారు. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్ సభ ఎన్నికల కోసం కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పని చేయాలని ఖర్గే పిలుపు ఇచ్చారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ అందరూ కష్టపడి పని చేయాలని పిలుపు ఇచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటేనే గెలుపు సాధ్యం అవుతుందని అన్నారు.


వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధిక స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా హైదరాబాద్ వచ్చిన మల్లిఖార్జున ఖర్గే.. ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ కమిటీలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీపైన కూడా విమర్శలు చేశారు. ప్రతి వార్తా పత్రికలో 'మోదీ గ్యారెంటీ' ప్రకటనలు వేశారని.. గతంలో బీజేపీ, మోదీ ఇచ్చిన హామీలు.. 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం. నల్లధనాన్ని వెనక్కి తెస్తాం. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం అన్నారని ఖర్గే అన్నారు. కానీ, ఇంత వరకూ ఏ ఒక్కటి కూడా ప్రధాని నెరవేర్చలేదని ఆగ్రహించారు. మోదీ హమీలపై వచ్చే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ప్రశ్నిస్తానని అన్నారు. తాము తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు హమీలు అమల్లోకి తెచ్చామని అన్నారు. మిగిలిన హామీలు కూడా అతి త్వరలోనే అమల్లోకి తెస్తామని చెప్పారు.


సమస్యలు ఎదురైనప్పుడు మోదీ ఏదో ఒక ఇష్యూతో డైవర్ట్‌ చేస్తుంటారని.. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో మోదీ దిట్ట అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.  ఈడీ, ఐటీ, సీబీఐలను ఉసిగొల్పి.. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారని అన్నారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్‌ నేతలు ఎవరూ భయపడబోరని.. అన్నారు. కేసీఆర్‌ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదని.. కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారని ఖర్గే గుర్తు చేశారు.


ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం.. ఒకసారి పాకిస్తాన్‌ ను మోదీ బూచీ చూపిస్తారని... మరోసారి దేవుడ్ని వాడుకుంటారని అన్నారు. మోదీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయాయని అన్నారు. సామాన్యుల ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్‌ న్యాయ యాత్ర చేస్తున్నారని. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మల్లిఖార్జున ఖర్గే పిలుపు ఇచ్చారు.




‘‘రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. బూత్  ఏజెంట్ల బాధ్యత చాలా ఉంది. అత్యంత కీలకమైన పని ఉంది. మీరు చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. ఆరు గ్యారంటీలు ఇచ్చాము.. అప్పుడే రెండు గ్యారంటీలు అమలు చేశాము. మనం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని అమలు చేస్తాం.. మోదీ గతంలో మోడీ గ్యారంటీ అని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు. రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ ఏమైంది. నల్లధనం వెనక్కు తెప్పిస్తాం అన్నాడు ఏం అయింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మోడీ అన్ని హామీలపై ప్రశ్నిస్తాం. దేశంలో తువాటకు పనులు లేవు.. రైతులకు పనులు లేవు. పని లేకపోతే ప్రజలకు ఉపాధి ఎలా. వారి కడుపు ఎలా నిండుతది. దేశంలో యువత ఉన్నారు వారికి ఉపాధి లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు’’ అని ఖర్గే మాట్లాడారు.