Mainpuri Bypoll Result:
2 లక్షల పైచిలుకు మెజార్టీ..
సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ ఇటీవలే అనారోగ్యంతో కన్ను మూశారు. ఫలితంగా...ఆయన నియోజకవర్గమైన మెయిన్‌పురిలో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఎస్‌పీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి రఘురాజ్ సింగ్ శక్యాపై 2లక్షల 80 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎస్పీ విజయ పరంపరను కొనసాగించారు. 2019లో ములాయం సింగ్ యాదవ్...ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ షక్యాపై 94,389 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ సారి డింపుల్ యాదవ్...అంతకు మించిన మెజార్టీతో గెలుపొందారు. ములాయం సింగ్ సోదరుడైన శివ్‌పాల్ సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడైన రఘురాడ్ సింగ్ షక్యా బీజేపీ నుంచి టికెట్ పొంది పోటీ చేశారు. ఓటమి చవి చూశారు. ములాయం సింగ్ 1996లో తొలిసారి ఇదే స్థానంలో ఎంపీగా గెలుపొందారు. ఆ తరవాత వరుసగా మూడు సార్లు ఇక్కడి నుంచే పోటీ చేశారు. 2004,2009,2019పోటీ చేసి గెలుపొందారు. 2014 ఉప ఎన్నికలో అఖిలేష్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ విజయం సాధించారు. ఇక డింపుల్ యాదవ్ విషయానికొస్తే...నాలుగు సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కన్నౌజ్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. 2009లో తొలిసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు డింపుల్ యాదవ్. కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ బబ్బర్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. 2012లో లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
యూపీలో కీలక పరిణామం..
ఉత్తర్‌ప్రదేశ్‌లో కీలక రాజకీయ పరిణామం జరిగింది. ప్రగతి శీల సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు శివపాల్ సింగ్ యాదవ్ తిరిగి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్ మధ్య విభేదాలు తలెత్తి ఎన్నోసార్లు విడిపోయారు. కానీ ఇటీవలి కాలంలో ఇరువురు కాస్త దగ్గరయ్యారు. తాజాగా మెయిన్‌పురి ఎన్నికల్లో డింపుల్ యాదవ్‌ను గెలిపించమని శివపాల్ యాదవ్‌ను అఖిలేశ్ కోరారు. దీంతో కీలకమైన ఉప ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. శివపాల్ యాదవ్ 2018లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి విడిపోయారు. అఖిలేశ్ యాదవ్‌తో
విభేదాల కారణంగా సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. 2017లో అఖిలేశ్ యాదవ్ ఎస్పీ పగ్గాలు చేపట్టిన తర్వాత శివపాల్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆ స్థానంలో అఖిలేశ్ తన భార్య డింపుల్ యాదవ్‌ను బరిలోకి దించారు. ఆమె గెలుపు కోసం బాబాయ్, అబ్బాయ్ కలిసే ప్రచారం చేశారు.