ఇండియన్ కమ్యూనిటీని టార్గెట్ చేసుకున్నారా..?
కెనడాలో మహాత్మా గాంధీ విగ్రహానికి అవమానం జరిగింది. ఒంటారియోలోని రిచ్‌మండ్ హిల్ సమీపంలో విష్ణు మందిర్ వద్ద 30 అడుగులగాంధీ విగ్రహం ఉంటుంది. గుర్తు తెలియన దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. భారతీయులను కించపరిచేందుకే ఎవరో ఉద్దేశపూర్వకంగా
ఈ పని చేశారని అక్కడి అధికారులు భావిస్తున్నారు. "రంగు, జాతి, వయసు, జెండర్ ఆధారంగా వివక్ష చూపించే వారెవరైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనే ఉపేక్షించం" అని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. ఈ ఘటన పట్ల భారత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కెనడాలోని ఇండియన్ హై కమిషన్ ఇదే విషయాన్ని ట్వీట్ చేసింది. "ఇండియన్ కమ్యూనిటీ వారిని భయపెట్టాలనే దురుద్దేశంతో చేసిన ఈ పనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కెనడాలోని భారతీయులందరిలోనూ ఇలాంటి ఘటనలు అభద్రతా భావాన్ని పెంచుతాయి. కెనడా ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడాం. విచారణ చేపట్టాలని అడిగాం" అని ట్విటర్‌లో పేర్కొంది. ఈ 5 మీటర్ల ఎత్తైన గాంధీ విగ్రహాన్ని 30 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు.
విచారణ ప్రారంభించాం...
"ఈ ఘటనతో భారతీయుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. వారిని ఆందోళనకు గురి చేశాయి. కెనడియన్ అధికారులతో ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. ఇన్వెస్టిగేట్ చేయాలని అడుగుతున్నాం" అని టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. ఇప్పటికే విచారణ ప్రారంభించామని, త్వరలోనే నేరస్థులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.