Uddhav Thackeray Shiv Sena: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలు ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలుగా ఉండగా.. వీటిలో ఉద్ధవ్ వర్గానికి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలో ఏక్ నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన వర్గం అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. బుధవారం స్పీకర్ ఈ కీలకమైన తీర్పు వెలువరించారు. ఈ రెండు వర్గాలు పరస్ఫరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటూ.. తమకు తామే అసలైన శివసేన అంటూ పిటిషన్లు వేశారు. దీనిపై స్పీకర్ తాజా తీర్పు ఇచ్చారు. షిండే వర్గానికే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని స్పీకర్ అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ తిరస్కరించారు. అలాగే, శివసేన పార్టీ 2018 రాజ్యాంగాన్ని పరిగణించాలన్న ఉద్ధవ్ వర్గం అభ్యర్థనను స్పీకర్ తోసిపుచ్చారు. ఎన్నికల కమిషన్‌కు 1999లో సమర్పించిన ఆ పార్టీ రాజ్యాంగమే చెల్లుబాటవుతుందని.. దాని ప్రకారం శివసేన ప్రముఖ్ (ఉద్ధవ్ ఠాక్రే)కు ఏ నేతనూ తొలగించే అధికారం లేదని స్పీకర్ తేల్చి చెప్పారు.
2022 జూన్‌లో శివసేన ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. శివసేనలోనే ఒక ఎమ్మెల్యే అయిన ఏక్ నాథ్ షిండే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో శివసేన ప్రభుత్వం కూలిపోయింది. తనకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు అందర్నీ తీసుకొని షిండే అసోంకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత బీజేపీ షిండేకు మద్దతు ప్రకటించింది. సుప్రీంకోర్టు అనుమతితో ఉద్ధవ్ ఠాక్రే బలపరీక్షలో తన మెజార్టీని నిరూపించుకోవాలని గవర్నర్ కోరారు. ఈ పరిణామాల వల్ల ఉద్ధవ్ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత శివసేనలో షిండే వర్గం- బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2022 జూన్ 30న ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జులై 4న ఏక్ నాథ్ అసెంబ్లీ బలపరీక్షలో గెలిచారు. ఈ రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ ఉండి ప్రభుత్వాన్ని కూలదోసిందనే ఆరోపణలు అప్పుడు బాగా వచ్చాయి.