సోమవారం మిస్సింగ్..ఉన్నట్టుండి ప్రత్యక్షం..
మహారాష్ట్ర రాజకీయాల్లో సినిమాను తలపించే నాటకీయత కనిపిస్తోంది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి గండం వచ్చి పడింది. పలువురు ఎమ్మెల్యేలఫిరాయింపులతో మెజార్టీ తగ్గింది. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. ఈ పరిణామాల మధ్యే ఓ శివసేన ఎమ్మెల్యే కనిపించకుండా పోవటం ఆందోళనలకు తెర తీసింది. సోమవారం నుంచి బాలాపూర్ ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ అదృశ్యమయ్యారు. ఈ మిస్సింగ్‌పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన మహారాష్ట్రకు తిరిగొచ్చారు. ఏక్‌నాథ్ షిండేని నమ్మి ఆయనతో పాటు గుజరాత్ వెళ్లానని, అక్కడి పోలీసులు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు నితిన్ దేశ్‌ముఖ్. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే మిస్ అయ్యి మళ్లీ మహారాష్ట్రకు చేరుకోగా తరవాత నితిన్ దేశ్‌ముఖ్ కూడా సొంత రాష్ట్రానికి వచ్చేశారు. ప్రస్తుతానికి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి పెద్ద కష్టమే వచ్చింది. ఏక్‌నాథ్ షిండే పార్టీపై తిరుగుబావుటా ఎగరేసి బయటకొచ్చారు. ఆయనతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలనూ తనవైపు తిప్పుకున్నారు.
థాక్రే సైనికుడిని..ఎప్పటికీ ఆయనతోనే
నితిన్ దేశ్‌ముఖ్ కన్నా ముందు మరో ఎమ్మెల్యే కైలాష్ పాటిల్ ఏక్‌నాథ్ షిండేపై ఆరోపణలు చేశారు. ఆయన మనుషులు బలవంతంగా గుజరాత్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, కానీ తప్పించుకుని వచ్చానని చెప్పారు. ఇటు నితిన్ దేశ్‌ముఖ్ తన స్వామి భక్తిని చాటుకున్నారు. "తాను ఛత్రపతి శివాజీ సైనికుడినని గుర్తు చేసిన నితిన్..గుజరాత్ పోలీసులు బలవంతంగా ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆరోపించారు. "నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ అదంతా అబద్ధం. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నా బ్లడ్ ప్రెజర్ పెరిగిందన్న మాటలో వాస్తవం లేదు" అని స్పష్టం చేశారు. గుజరాత్ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పుకార్లు పుట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆసుపత్రిలో ఓ పాతిక మంది చుట్టుముట్టి తనకు బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ ఇంజెక్షన్ ఎందుకు ఇచ్చారో, అందులో ఏముందో తనకు తెలియదని చెప్పారు. నాకు అనారోగ్యం కలిగించాలనే ఉద్దేశంతోనే అలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను థాక్రే సైనికుడినని, ఆయనతో ఇప్పటికే మాట్లాడానని, ప్రస్తుతానికి స్వగృహానికి వెళ్తున్నానని వెల్లడించారు నితిన్ దేశ్‌ముఖ్.