Maharashtra: రాజకీయ నాయకులు.. వాళ్లు ఎప్పుడు వార్తల్లో ఉండాల్సిందే. లేకపోతే వారికి టైం పాస్ అవదు. వాళ్లు, వీళ్లు తేడా లేకుండా ఎవరిపైనా సింపుల్‌గా విమర్శలు చేస్తారు. కొన్ని సార్లు లేనిపోనివి చెబుతుంటారు. చివరకు చంద్రుడు కూడా తమకు మామే అవుతాడని చెబుతారు. కొందరు తాము సినిమా హీరోలకంటే తక్కువ కాదంటారు. కొన్ని సార్లు సినిమా నటులంతా డమ్మీలు అంటారు.  సినిమా పరిశ్రమకు, రాజకీయ నాయకులకు ఉన్న అనుబంధం అలాంటింది. సినీ పరిశ్రమకు చెందిన వారిపై రాజకీయ నాయకులు చేసే కామెంట్లు కొన్ని సార్లు వైరల్ అవుతుంటాయి.


తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ మంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌పై సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలు వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. రోజూ చేపలు తినడం ద్వారా చర్మం మృదువుగా మారుతుందని, కళ్లు మెరుస్తాయని, ఎవరైనా మిమ్మల్ని చూసి ఆకర్షణకు గురవుతారని, ఇందుకు ఐశ్వర్యా రాయ్ ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించారు. అంతే సంగతి. ఒక్కసారిగా మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


మహారాష్ట్ర ధూలే జిల్లాలోని అంతుర్లీ గిరిజన మత్స్యకారులకు చేపల వేట సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మత్స్యకారులను ఉద్దేశించి గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి విజయ్‌ కుమార్‌ గవిత్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రోజూ చేపలు తినడం ద్వారా చర్మం మృదువుగా మారుతుందని, కళ్లు మెరుస్తాయన్నారు. ఎదుటి వారు మిమ్మల్ని చూసి ఆకర్షణకు గురవుతారని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌ గురించి చెప్పారు. 


మంగళూరులోని బీచ్‌ సమీపంలో నివసించే సమయంలో ఐశ్వర్య రాయ్ రోజూ చేపలు తినేదన్నారు. మీరు ఆమె కళ్లు చూశారా? అని సభకు వచ్చిన వారిని ప్రశ్నించారు. చేపలు తినడం ద్వారా మన కళ్లు ఐశ్వర్యారాయ్ కళ్లలా తయారవుతాయన్నారు. చేపల్లో కొన్ని నూనెలుంటాయని, అవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయని చెప్పుకొచ్చారు. దీంతో ఆయనపై సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీడియోలను వైరల్ చేస్తూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మంత్రి విజయ్‌ కుమార్‌ గవిత్‌ కుమార్తె హీనా గవిత్‌ బీజేపీ తరఫున లోక్‌సభలో ఎంపీగా కొనసాగుతున్నారు. ఆమెపై గవిత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రకటనపై పలువురు నేతలు సైతం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు మాని గిరిజనుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.


మరో బీజేపీ ఎమ్మెల్యే నితీష్‌ రాణే స్పందిస్తూ.. తాను రోజు చేపలు తింటానని, తన కళ్లు కూడా అలాగే ఉండాలని, కానీ లేవన్నారు. దీనిపై ఏమైనా పరిశోధన ఉందా? అని మంత్రిని ప్రశ్నించారు. ఎన్‌సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ స్పందిస్తూ.. మంత్రి ఇలాంటి పనికిమాలిన వ్యాఖ్యలు చేయకుండా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు.