Maharashtra Karnataka border row: మహారాష్ట్ర- కర్ణాటక సరిహద్దు వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారింది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో జరిగిన నిరసనలు, ఆందోళనలు.. ఇప్పుడు దాడుల వరకు చేరాయి.
ఆర్టీసీ బంద్
మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులపై కర్ణాటకలో నిరసనకారులు మంగళవారం దాడులు చేశారు. బస్సులపైకి రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. దీంతో కర్ణాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్టుమెంట్ ప్రకటించింది. అక్కడికి బస్సులను నడపడం శ్రేయస్కరం కాదని మహారాష్ట్ర పోలీసులు హెచ్చరించడంతో తాము బస్సు సర్వీసులను నిలిపివేశామని తెలిపింది.
పవార్ వార్నింగ్
సరిహద్దులో ఆందోళనకర పరిస్థితులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ ఘాటుగా స్పందించారు. ఈ ఆందోళనకర పరిస్థితులకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కారణమని పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోకి ప్రవేశించే వాహనాలపై దాడులు ఆపకుంటే మరో విధంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ వివాదం
సరిహద్దు ప్రాంతంలో ఉన్న కన్నడ, మరాఠి మాట్లాడే గ్రామాలు తమకే చెందినవంటూ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలు ఇటీవల ప్రకటనలు చేశారు. దీంతో సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తాజాగా మహారాష్ట్ర మంత్రులు కర్ణాటకలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ బెళగావి జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలపై రాళ్లు రువ్వి దాడి చేయడంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.
Also Read: Parliament Winter session: వాళ్ల బాధను అర్థం చేసుకోండి- సభ సజావుగా సాగనివ్వండి: మోదీ