డిప్యుటీ సీఎంగా ఫడణవీస్..ఎవరూ ఊహించని ట్విస్ట్ 


మహారాష్ట్రలో ఠాక్రే సర్కార్ కుప్పకూలిపోయాక ఎవరు సీఎం అవుతారు అన్నది చివరి వరకూ సస్పెన్స్‌గానే ఉంది. దేవేంద్ర ఫడణవీస్‌కే మళ్లీ ఈ పదవి దక్కుతుందని భావించినా చివర్లో భాజపా అదిష్ఠానం ట్విస్ట్ ఇచ్చింది. రెబల్ లీడర్ ఏక్‌నాథ్ షిండేకే ఆ సీటు కట్టబెట్టింది. ఫడణవీస్‌ను డిప్యుటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఇదే ఎవరూ ఊహించలేదు. భాజపా సీనియర్ నేతను కాదని, షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం ఏంటని రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దీని వెనక ఓ కథ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ మలుపులన్నింటినీ ఫడణవీస్ పరిశీలించారని, నిజానికి ఆయన ఇంటిలిజెన్స్ వల్లే ఇదంతా సాధ్యమైందని భాజపా వర్గాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు ఫడణవీస్‌ను ఎందుకు సీఎం చేయలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికీ సమాధానమిస్తున్నారు పలువురు నేతలు. 


ప్రధాని మోదీ కాల్‌ చేసి మాట్లాడారా..? 


ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు రెండు సార్లు కాల్ చేసిన ఫడణవీస్‌తో మాట్లాడారని, అధిష్ఠాన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆయన డిప్యుటీ సీఎం పదవిని అంగీకరించారని భాజపా శ్రేణులు అంటున్నాయి. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు హోం మంత్రి అమిత్‌షా కూడా ఈ విషయమై ఫడణవీస్‌తో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఇదంతా జరగకముందు తాను ప్రభుత్వంలో ఏ విధమైన పదవిలోనూ ఉండనని, తనదంటూ ఎలాంటి భాగస్వామ్యం ఉండదని ప్రకటించారు ఫడణవీస్. ఈ ప్రకటన తరవాతే అధిష్ఠానం ఫడణవీస్‌తో మాట్లాడినట్టు సమాచారం. ఫడణవీస్ లాంటి నేత ప్రభుత్వంలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తే రాష్ట్రానికి, పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని  అధిష్ఠానంభావించిందట. అందుకే వెంటనే ఆయనతో మంతనాలు జరిపింది. "ప్రభుత్వంలో ఉండను" అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించిందనీ తెలుస్తోంది. పెద్దల మాట కాదనలేక ఫడణవీస్‌ డిప్యుటీ సీఎం కుర్చీలో కూర్చునేందుకు ఒప్పుకున్నారట. 


అయితే అంతకు ముందు ఎన్‌సీపీ నేత శరద్ పవార్ మాత్రం ఇందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రి పదవికే పరిమితం చేయటాన్ని దేవేంద్ర ఫడణవీస్ జీర్ణించుకోలేకపోతున్నారని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. "నెంబర్ 2 పొజిషన్‌లో ఉండటం ఫడణవీస్‌కు ఇష్టం లేదు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతోంది ఎంత అసంతృప్తితో ఉన్నారో" అంటూ కామెంట్ చేశారు పవార్. ఫడణవీస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తగా పని చేశారని, అధిష్ఠానం ఎలా చేయమంటే అలా చేయటం ఆయన పని అని వ్యాఖ్యానించారు. "ఇది నిజంగా సర్‌ప్రైజ్. నాకు తెలిసి రెబల్ ఎమ్మెల్యేలు కూడా తమ లీడర్ సీఎం అవుతారని ఊహించి ఉండరు. మరో సర్‌ప్రైజ్ ఏంటంటే..ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఫడణవీస్‌కు డిప్యుటీ సీఎం ఇవ్వటం" అని అన్నారు శరద్ పవార్.