Mahanadu 2022 Chandrababu Speech: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్మాది పాలన సాగుతోందని, తద్వారా రాష్ట్రం పరువు పోయే స్థితికి చేరిందని మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఎన్నో సమస్యలు నెలకొన్నాయని, దేశంలో ఎక్కడా లేనట్లుగా పన్నులు పెంచి.. భయంకరమైన ‘బాదుడే బాదుడు’ అమలు చేస్తున్నారని ఆరోపించారు. పాలన చేతకాకపోతే అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టుకొని పాలించాలని హితవు పలికారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని మండువావారి పాలెంలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఇందులో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్రంగా ఘాటు విమర్శలు చేశారు.


‘‘రాజకీయాన్ని తమాషా అనుకోవద్దు. ఒక ఉన్మాది పాలన ఈ రాష్ట్రానికి శాపంగా మారింది. రాష్ట్రం పరువు పోయే పరిస్థితికి వచ్చింది. ఎన్నో రాజకీయాలు, పోరాటాలు, ముఖ్యమంత్రులను చూశాం. ఆంధ్రా చరిత్ర టీడీపీకి ముందు తర్వాత అని చెప్పుకొనే పరిస్థితి ఉంది. మనం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నాం. ఈ మూడేళ్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనట్లుగా పన్నులు పెంచారు. భయంకరమైన బాదుడే బాదుడు.. ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఒక తప్పుని తప్పుగా ప్రశ్నిస్తే అవతలి వాళ్లు కరెక్ట్ చేసుకోలేని వాళ్లు చరిత్ర హీనులుగా మారిపోతారు. అలాంటి వాళ్లే వైఎస్ఆర్ సీపీ నాయకులు. 


పెట్రోల్ డీజిల్ ధరలు కేంద్రం సహా అనేక రాష్ట్రాలు తగ్గిస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. గ్యాస్, కరెంటు ఛార్జీలు అన్ని బాదుడే బాదుడు. అన్నీ కరెంటు కోతలే. రాని కరెంటు కోసం అధిక ఛార్జీలు. పాలన చేతకాకపోతే, అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టుకొని పరిపాలన చేయండి. నీ వల్ల (సీఎం) ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు.


మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు
మూడేళ్లు మనం ఇబ్బందులు పడ్డాం. అచ్చెన్నాయుడును అరెస్టు చేశారు. వేదికపై నుంచే నాయకుల్ని అరెస్టు అయ్యారు. తెలుగు తమ్ముళ్లకు ఇబ్బందులు వస్తున్నాయి. దాడులు చేస్తూ తరచూ అరెస్టు చేస్తున్నారు. ఇదంతా చూసి నేను నిద్రలు లేని రాత్రులు ఎన్నో గడిపా. ఇంతకుముందు రాజకీయ నాయకులు బాధ్యతతో ప్రవర్తించేవారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడేవారు. ఈ రోజు ఉన్న నాయకులు కరడు గట్టిన నేరస్థులుగా ఉన్నారు. తప్పులు చెప్పి రాజకీయం చెప్పే వ్యక్తులు. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిని విరోధులుగా చూస్తున్నారు.’’ అని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు.