Mahagathbandhan Names Tejashwi CM Face: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండీ కూటమి తన సీఎం అభ్యర్థిని ప్రకటించింది. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా, వికాస్‌శీల్ ఇన్‌సాన్ పార్టీ (వీఐపీ) అధినేత ముకేష్ సహనిని డిప్యూటీ సీఎం అభ్యర్థిగా గురువారం అధికారికంగా ప్రకటించింది. ఇంకా ఒక డిప్యూటీ సీఎం అభ్యర్థిని తర్వాత ప్రకటిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తెలిపారు.
పాట్నాలో జరిగిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తేజస్వి యాదవ్, ముకేష్ సహని సహా కాంగ్రెస్ బీహార్ ఇన్‌చార్జ్ కృష్ణ అల్లవరు, బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్, లెఫ్ట్ పార్టీల నేతలు హాజరయ్యారు. వారం రోజులుగా సీటు పంపకాలు, సీఎం ఫేస్ ప్రకటనపై చర్చలు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి నేతలతో చర్చల తర్వాత తేజస్వి యాదవ్‌ను సీఎం ఫేస్‌గా నిర్ణయించాం. ఆయనకు దీర్ఘకాలిక భవిష్యత్ ఉందని అశోక్ గెహ్లాట్ అన్నారు. ముకేష్ సహని నిషాద్ వర్గంలో ప్రభావం కలిగిన నేత కావడంతో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. మరో వెనుకబడినవర్గాల నేతను డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తామని కూటమి ప్రకటించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా సీఎం కావడం మాత్రమే లక్ష్యం కాదని.. బీహార్ అభివృద్ధి కోసం మేము ఏకమయ్యాం. 20 ఏళ్ల 'ఉపయోగం లేని' డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి" అని తేజస్వీ యాదవ్ పిలుపునిచ్చారు. ఎన్‌డీఏ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని.. నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్నికలు జరుగుతున్నాయో లేదో చెప్పాలన్నారు. నితీష్ కుమార్‌కు ఎన్‌డీఏలో అన్యాయం జరుగుతోంది. ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు.
సీటు పంపకాలలో ఆలస్యం కారణంగా ఆర్‌జేడీ, కాంగ్రెస్, వీఐపీలు మొదటి దశలో ఏకపక్షంగా నామినేషన్లు దాఖలు చేశాయి. కనీసం 7 సీట్లలో అలయన్స్ భాగస్వాముల మధ్య పోటీ ఉంది. మొత్తం సీట్లలో ఆర్‌జేడీ 143, కాంగ్రెస్ 61 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మిగిలిన సీట్లు సీపీఐ(ఎమ్‌ఎల్), వీఐపీ, ఇతర చిన్న పార్టీలకు కేటాయించారు. మొత్తం 243 సీట్లకు 253 మంది అభ్యర్థులను ప్రకటించారు. పది చోట్ల ఫ్రెండ్లీ ఫైట్ జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశ నవంబర్ 6న 121 సీట్లకు, రెండో దశ నవంబర్ 11న 122 సీట్లకు పోలింగ్. ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి.