Jitendra Awhad on Lord Ram:
జితేంద్ర వ్యాఖ్యలు..
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir Opening) అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంగరంగవైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించనుంది ప్రభుత్వం. అటు ఏర్పాట్లు జరుగుతుండగానే ఇటువైపు రాజకీయ దుమారం కొనసాగుతోంది. బీజేపీ వ్యతిరేక పార్టీలు అయోధ్య ఉత్సవంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు NCP నేత జితేంద్ర అవ్హద్ (Jitendra Awhad) రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు మాంసాహారి అని ఆయన చేసిన కామెంట్స్ సంచలనమవుతున్నాయి. శరద్ పవార్ క్యాంప్‌కి చెందిన NCP నేత అయిన జితేంద్ర షిరిడీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. రాముడు బహుజన వర్గానికి చెందిన వాడని అన్నారు. ఆయన జంతువులను వేటాడి వాటి మాంసం తినే వాడని తేల్చి చెప్పారు. అన్నేళ్ల పాటు అడవిలో ఉన్న రాముడికి శాకాహారం ఎక్కడ దొరికిందని ప్రశ్నించారు.
"రాముడు బహుజన వర్గానికి చెందిన వాడు. ఆయన జంతువులను వేటాడి వాటి మాంసం తినేవాడు. రాముడిని ఉదాహరణగా చూపించి అందరూ శాకాహారులైపోవాలని ప్రచారం చేస్తున్నారు. కానీ రాముడు శాకాహారి కాదు..మాంసాహారి. 14 ఏళ్ల పాటు అడవిలో ఉన్న రాముడికి శాకాహారం ఎక్కడ నుంచి దొరుకుతుంది..?"
- జితేంద్ర అవ్హద్, ఎన్‌సీపీ నేత
తీవ్ర వ్యతిరేకత..
అయోధ్య ఉత్సవానికి కొద్ది రోజుల ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు క్షమాపణలు చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అజిత్ పవార్ మద్దతుదారులు అవ్హద్‌కి వ్యతిరేకంగా రోడ్లపై నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అల్లర్లు జరిగే ప్రమాదముందని గ్రహించిన పోలీసులు వెంటనే అవ్హద్ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ వరకూ పాదయాత్ర చేసి అక్కడ ఫిర్యాదు చేస్తామని మద్దతుదారులు తేల్చి చెప్పారు. కొంత మంది బీజేపీ నేతలూ జితేంద్రపై మండి పడుతున్నారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.