TMC MP Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. డబ్బులు తీసుకుని లోక్ సభలో ప్రశ్నలు అడిగారని ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను శుక్రవారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దీనిపై చర్చించి ఓటింగ్ నిర్వహించారు. కమిటీ నివేదికను లోక్ సభ ఆమోదించడం వల్ల టీఎంసీ మహుమా మొయిత్రాను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ను కూడా వేరే వాళ్లకు ఇచ్చినట్లు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఎథిక్స్ కమిటీ నివేదికపై పూర్తి చర్చ అనంతరం మహువా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనికి నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేసి పార్లమెంట్ బయటకు వచ్చారు. అనంతరం లోక్ సభను స్పీకర్ ఈ నెల 11 (సోమవారం) కు వాయిదా వేశారు.









మహువాకు అనుమతి నిరాకరణ


'ఎంపీ మహువా అనైతికంగా, అమర్యాదగా ప్రవర్తించారని కమిటీ చేసిన తీర్మానాన్ని ఈ సభ అంగీకరించింది. అందువల్ల ఆమె ఇక ఎంపీగా కొనసాగడం తగదు.' అని స్పీకర్ ఓంబిర్లా వెల్లడించారు. తొలుత ఎథిక్స్ కమిటీ నివేదిక లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, దీన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ఎథిక్స్ కమిటీ నివేదికపై అధ్యయనం చేసేందుకు తమకు సమయం ఇవ్వాలని కోరాయి. ఈ క్రమంలో ఓటింగ్ కు ముందు నివేదికపై చర్చకు స్పీకర్ అనుమతివ్వగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఈ చర్చలో తనకు మాట్లాడేందుకు అనుమతివ్వాలని స్పీకర్ ను మహువా కోరగా, ఆయన నిరాకరించారు. అనంతరం మూజువాణి ఓటు ద్వారా ఎథిక్స్ నివేదికను సభ ఆమోదించింది.


మహువా స్పందన


లోక్ సభ చర్యపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. ఎథిక్స్ ప్యానెల్ నివేదికపై ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను లోక్ సభ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. లోక్ సభ చర్యను తీవ్రంగా ఖండించారు. 'ఎథిక్స్ కమిటీ ప్రతీ నిబంధనను ఉల్లంఘించింది. మమ్మల్ని అణగదొక్కేందుకు ఈ కమిటీని ఓ ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. కేవలం ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మి నన్ను దోషిగా నిర్ధారించారు. ఇక సీబీఐని మా ఇంటికి పంపి నన్ను వేధిస్తారేమో.?' అంటూ మహువా ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రతిపక్షాల ఆందోళన


మరోవైపు, ప్రతిపక్షాలు సైతం ఈ చర్యను తప్పుబట్టాయి. ఇది ఓ బ్లాక్ డే అని కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందు లోక్ సభకు హాజరయ్యే సమయంలో పార్లమెంట్ వద్ద మహువా మీడియాతో మాట్లాడారు. 'దుర్గామాత వచ్చింది. ఇక చూసుకుందాం. వినాశనం సంభవించినప్పుడు తొలుత కనుమరుగయ్యేది వివేకమే. వస్త్రాపహరణాన్ని వారు మొదలుపెట్టారు. ఇక మహా భారత యుద్ధాన్ని చూస్తారు.' అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించారు.






నిషికాంత్‌ దుబే ఆరోపణలతో వెలుగులోకి...


తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఎంపీ మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ (Bjp Mp ) నిషికాంత్‌ దుబే (Nishikanth dube ) సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నారని దూబే ఆరోపించారు. అదానీ గ్రూప్, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్‌ చేసి మాట్లాడేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహుబా డబ్బులు తీసుకున్నారని అన్నారు. పారాదీప్, ధమ్రా పోర్ట్ నుంచి చమురు, గ్యాస్‌ సరఫరా, యూరియా సబ్సిడీ, రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపుతున్న ఉక్కు ధరలు, ఆదాయపు పన్ను శాఖ అధికారాలపై మహువా ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. తక్షణమే ఆమెను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ, స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించడం, సభా ధిక్కారం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. 


ఖరీదైన బహుమతులు 


ఓ కాంట్రాక్టు అదానీ గ్రూపునకు దక్కడంతో హీరానందానీ గ్రూపు వ్యాపార ప్రయోజనాలను కాపాడేందుకు ఎంపీ మహువా మొయిత్రా ప్రయత్నించారని నిషికాంత్ దూబే ఆరోపించారు. హీరానందానీ గ్రూపునకు అనుకూలంగా ప్రశ్నలు అడిగినందుకు  రూ.2 కోట్లు, ఐఫోన్‌ వంటి ఖరీదైన బహుమతులు, ఎన్నికల్లో పోటీకి రూ.75 లక్షలు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. ఎంపీ మహువా, వ్యాపారవేత్త మధ్య లంచాల మార్పిడికి సంబంధించి ఆధారాలను ఓ లాయర్ తనకు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు. 2019 నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు మహువా అడిగారని నిషికాంత్‌ తెలిపారు. 


ఇదీ చూడండి: UPI Transaction: యూపీఐ పేమెంట్స్‌పై తియ్యటి కబురు, ఇప్పుడు రూ.5 లక్షల వరకు చెల్లించొచ్చు