Lokayukta police register FIR: కర్ణాటకలో లోకాయిక్త పోలీసులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక - FIR నమోదు చేశారు. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో ఈ కేసు నమోదైంది. సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన సతీమణి పార్వతితో పాటు మరికొందరు పేర్లను పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.


ఏ1, ఏ2 వీరే..


మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ - MUDA ప్లాట్ల కేటాయింపు వివాదంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో సిద్ధరామయ్యను A1గా పేర్కొన్న పోలుసులు ఆయన భార్య పార్వతమ్మను A2గా పేర్కొన్నారు. వీరితో పాటు ముఖ్యమంత్రి బావమరిది మల్లికార్జున స్వామితో పాటు మరికొందరు పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. కొద్ది వారాల క్రితం ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఈ స్థలాల కుంభకోణంకి సంబంధించి గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ విచారణకు అనుమతించారు. జులై చివరిలో ఈ అంశంపై హైకోర్టుకు సిద్ధరామయ్య వెళ్లగా గెహ్లోత్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే లోకాయుక్త కోర్టు జడ్డి సంతోష్ గజానన్ వెంటనే పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. లోకాయుక్త కోర్టు ఆదేశాలతో పోలీసులు వివిధ చట్టాలు, సెక్షన్ల కింద సిద్ధరామయ్య దంపతులపై కేసు నమోదు చేశారు.


అసలేంటీ కుంభకోణం.?


కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన ఒక అభివృద్ధి ప్రాజెక్టు కోసం సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మ భూమిని ఇచ్చారు. భూమి కోల్పోయిన ఆమెకు పరిహారంగా మైసూరులోని అత్యంత ఖరీధైన ప్రదేశంలో 14 ప్లాట్లను కేటాయించారు. ఈ స్థలాలన్నీ మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ- ముడావి కాగా అదే కేటాయించింది. ఈ కేటాయింపులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్ విలువ రూ.3 వేల కోట్ల వరకు ఉంటుందని విపక్షాలు ఆరోపించాయి. ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి దంపతులతో పాటు ఆయన బావమరిది మల్లికార్జున స్వామి దేవరాజ్‌ కూడా భాగంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందులో దళితుల భూములు కూడా ఉన్నాయంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆర్టీఐ కార్యకర్తలు స్నేహమయి కృష్ణ, అబ్రహం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మొత్తం వ్యవహారంపై జులై చివరి వారంలో గవర్నర్ గెహ్లోత్ విచారణకు ఆదేశించగా దాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తప్పుబట్టారు. హైకోర్టులో గెహ్లోత్ నిర్ణయాన్ని సవాల్ చేశారు. కేంద్రం తనపై కుట్ర చేస్తోందని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఈ కుట్రలకు తాను వెరవబోనని చెప్పారు. కోర్టులపై తనకు విశ్వాసం ఉందని అన్నారు.


ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం హైకోర్టు సిద్ధరామయ్య పిటిషన్‌ను కొట్టేయడంతో లోకాయుక్త కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు పోలీసులను ఆదేశించింది. కర్ణాటకలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులపై ఆరోపణలను ఈ కోర్టు విచారిస్తుంది. లోకాయుక్త కోర్టు ఆదేశాలతో పోలీసులు మైసూరు లోకాయుక్త కోర్టులో కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదుకు ముందు లోకాయుక్త పోలీసులు న్యాయసలహా కూడా తీసుకున్నారు. కోర్టు తీర్పు సహా మైసూరు లోకాయుక్త స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుతో సిద్ద రామయ్య రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.