Lok Sabha Elections Phase 6 2024 Updates: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ ముగిసింది. మొత్తం 6 రాష్ట్రాలతో పాటు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకూ ఈసీ (సాయంత్రం 5 గంటల సమయానికి) అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తంగా 57.7% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వెస్ట్ బెంగాల్‌లో 77.99% పోలింగ్‌ రికార్డ్ అయింది. యూపీలో 52% పోలింగ్‌ మాత్రమే నమోదవడం చర్చనీయాంశమైంది. ఇక బిహార్‌లో 52.24% పోలింగ్‌ నమోదైంది. ఉత్కంఠ రేపిన ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో 53.73% ఓటు శాతం నమోదైనట్టు ఈసీ వెల్లడించింది.


ఇక హరియాణాలో 55.93%, జమ్ముకశ్మీర్‌లో 51.35%,ఝార్ఖండ్‌లో 61.41%,ఒడిశాలో 59.60% పోలింగ్‌ రికార్డైంది. వెస్ట్‌బెంగాల్‌లో అత్యధికంగా పోలింగ్‌ నమోదైనప్పటికీ బీజేపీ ఎంపీ అభ్యర్థిపై రాళ్ల దాడి జరగడం కాస్త అలజడి సృష్టించింది. ఇవాళ్టితో (మే 25) మొత్తం 543 సీట్లున్న లోక్‌సభలో 486 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. అక్కడితో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. 


పోలింగ్‌ శాతంపై ఈసీ క్లారిటీ..


అయితే...పోలింగ్ శాతాలు విడుదల చేయడంలో ఈసీపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టులో ఈసీపై ఓ పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై ఈసీ గట్టిగానే స్పందించారు. మొత్తం ఇప్పటి వరకూ ఐదు విడతల పోలింగ్‌లో నమోదైన ఓటు శాతాలను విడుదల చేసింది. ఈ విషయంలో ఫార్మాట్‌ని మార్చుతున్నట్టు వెల్లడించింది. ఈసీపై ఆరోపణలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టేసిన వెంటనే ఎన్నికల సంఘం ఈ వివరాలు తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో పోలింగ్ శాతానికి సంబంధించిన లెక్కల్ని అప్‌లోడ్ చేసింది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎంతెంత ఓటింగ్ నమోదైందో చాలా స్పష్టంగా అందులో పబ్లిష్ చేసింది. ఈ లెక్కల్ని మార్చడం అసాధ్యం అని తేల్చి చెప్పింది.


ఏప్రిల్ 19న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అన్ని దశలకు సంబంధించిన వివరాలనూ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని ఈసీ స్పష్టం చేసింది. ఓటరు శాతం విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలనీ కొట్టిపారేసింది. అందరికీ అన్ని సమయాల్లో ఈ డేటా అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు మహువా మొయిత్రా, పవన్‌ ఖేరాతో సహా పలువురు ప్రముఖులు ఓటుశాతం వెల్లడించడంలో మోసం జరుగుతోందని ఆరోపించారు. కావాలనే కొన్ని చోట్ల ఎక్కువ చేసి చూపుతున్నారని మండి పడ్డారు. 


"ఎన్నికల కమిషన్‌ అధికారులు అన్ని రాష్ట్రాల్లోని ఓటింగ్ శాతాన్ని వీలైనంత వరకూ అందరికీ అందుబాటులో ఉంచేందుకే ప్రయత్నిస్తున్నారు. అన్ని ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ఈ డేటా విడుదల చేస్తున్నాం. ఇందులో మార్పులు చేర్పులు చేయడం అసాధ్యం"


- ఎన్నికల సంఘం 






Also Read: BJP MP Candidate Attacked: బీజేపీ ఎంపీ అభ్యర్థిని పరిగెత్తించి కొట్టిన ఆందోళనకారులు, రాళ్లు ఇటుకలతో దాడి