Elections 2024 Results: దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది రోజులుగా రాజకీయాలు ఎంత నాటకీయంగా మారాయో గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సంచలనమైంది. లిక్కర్ స్కామ్‌లో ఆయనే సూత్రధారి అంటూ ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం ఆ పార్టీకి సవాల్‌గా మారింది. ఇలాంటి కీలక తరుణంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి చూస్తుంటే ఇక్కడి 7 ఎంపీ స్థానాల్లో పూర్తిగా NDA లీడ్‌లో ఉంది. ఇప్పటి వరకూ ఇండీ కూటమి అసలు ఖాతా తెరవలేదు. పూర్తిగా ఇక్కడ బీజేపీ డామినేషన్ కనిపిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ అవడం, లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్‌కి పాల్పడినట్టు ఆరోపణలు రావడం ఆ పార్టీపై గట్టిగానే ప్రభావం చూపించినట్టు ఈ ఫలితాల ట్రెండ్‌తో అర్థమవుతోంది. అటు కాంగ్రెస్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 


 



మొత్తం 7 స్థానాలకు 7 స్థానాలు NDA గెలుచుకుంటే ఆ తరవాత అసెంబ్లీ ఎన్నికలపైనా ఈ ఎఫెక్ట్‌ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అవినీతీ ఆరోపణలు ఎదుర్కొన్న ఆప్‌తో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీనీ దెబ్బ తీసినట్టుగానే కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బెయిల్‌పై బయటకొచ్చారు కేజ్రీవాల్. తాను ఏ తప్పూ చేయలేదని, ఇదంతా బీజేపీ చేసిన కుట్ర అని తీవ్ర ఆరోపణలు చేశారు. క్లీన్‌చిట్‌తో బయటకు వస్తానని చాలా కాన్ఫిడెంట్‌గా ప్రచారం చేశారు. కానీ ఈ ప్రచార ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.