Elections Results 2024: యూపీ ఓటర్లు ఈ సారి గట్టి సర్‌ప్రైజ్ ఇచ్చేలా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌ని తమ కంచుకోటగా భావించిన బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. కౌంటింగ్ మొదలై మూడు గంటలు కావస్తోంది. ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి చూస్తే...34 చోట్ల NDA కూటమి లీడ్‌లో ఉండగా...అటు ఇండీ కూటమి 45 చోట్ల దూసుకుపోతోంది. ఈ లెక్కలు ఎవరూ ఊహించలేదు. యోగి ఆదిత్యనాథ్ ఇలాకాలో బీజేపీకి ఇంత తక్కువ చోట్ల ఆధిక్యం రావడంపై గట్టి చర్చే జరుగుతోంది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ యూపీలో గట్టిగానే ప్రభావం చూపించినట్టు ప్రస్తుత ట్రెండ్‌ని బట్టి తెలుస్తోంది.
మొత్తం 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 62 చోట్ల విజయం సాధించింది. బీఎస్‌పీ పది చోట్ల, సమాజ్‌వాదీ పార్టీ 5 స్థానాలు గెలుచుకుంది. ఈసారి బీఎస్‌పీ పెద్దగా ప్రభావం చూపించినట్టుగా కనిపించడం లేదు. యూపీలో అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. అమేథిలో ప్రస్తుతానికి స్మృతి ఇరానీ లీడ్‌లో ఉండగా..రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు.