Lok Sabha Polls 2024: త్వరలోనే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈలోగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటించి స్థానిక ఎన్నికల అధికారులతో సమావేశమవుతోంది. ఈ క్రమంలోనే యూపీలో పర్యటించింది. ఆ తరవాత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఎన్నికలు ఎలా నిర్వహించనున్నారో మీడియాకి వివరించారు. ఎన్నికల ప్రక్రియని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఏ పార్టీపైనా పక్షపాతం చూపించే అవకాశముండదని తేల్చి చెప్పారు. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే తమతో మాట్లాడాయని, ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయని తెలిపారు. ఎన్నికల్లో ధన బలాన్ని వినియోగించడం మానుకోవాలని సూచించారు.
"లోక్‌సభ ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాం. నిబంధనలు అన్ని పార్టీలకూ ఒకే విధంగా అమలవుతాయి. ఏ పార్టీపైనా పక్షపాతం చూపించం. ఆప్, బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలూ మాతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఎన్నికల్లో ఎక్కడా అవకతవకలు జరగకుండా సమర్థంగా నిర్వహించాలని డిమాండ్ చేశాయి. పోలీసులు ఏకపక్షంగా పని చేయడం మానుకోవాలని చెప్పాయి. అంతే కాదు. ఎన్నికల్లో కొన్ని పార్టీలు ధనబలాన్ని వినియోగిస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశాయి"
- రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల అధికారి
ఇదే సమయంలో యూపీలోని ఎన్నికల స్థితిగతులపైనా మాట్లాడారు రాజీవ్ కుమార్. తొలిసారి ఓటు వేసే మహిళల సంఖ్య ఈ సారి ఎక్కువగా ఉందని, వాళ్లందరి కోసం అన్ని పోలింగ్ బూత్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పిస్తామని తెలిపారు.
"ఈ సారి తొలిసారి ఓటు వేసే మహిళల సంఖ్య 7 లక్షల 26 వేల వరకూ ఉంది. పోలింగ్ బూత్‌లలో వీళ్లందరికీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. వాళ్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండూ చూసుకుంటాం. కొన్ని పోలింగ్ బూత్‌లను పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. 85 ఏళ్లు పైబడిన వాళ్లు ఇంట్లో నుంచే ఓటు వేసేలా వెసులుబాటు తీసుకొస్తాం. ఈ ఎన్నికల ప్రక్రియలో అర్హులందరూ భాగస్వాములు కావాలి"
- రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల అధికారి