Lok Sabha Elections 2024 Schedule: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. జూన్ 4 వ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయని వెల్లడించింది. అయితే...ఇప్పుడు ఈ తేదీల్ని మార్చింది. మిగతా అన్ని చోట్లా జూన్ 4నే ఫలితాలు వెలువడినా...అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్‌లో మాత్రం అంత కన్నా ముందే విడుదల చేయనుంది. జూన్ 2వ తేదీనే ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు ఈసీ అధికారికంగా ఓ ప్రకటన చేసింది. 


 






ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీనే ముగియనుంది. అయితే...జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. అంటే...జూన్ 2న అసెంబ్లీ గడువు ముగిసిన తరవాత జూన్ 4కి మధ్య రెండు రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్‌లలో ప్రభుత్వమే లేకుండా పోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే జూన్ 2నే ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువరించాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం. అంటే అసెంబ్లీ గడువు ముగిసిన రోజే ఫలితాలు వెలువడుతాయి. ఆ రోజే కొత్త ప్రభుత్వం ఏంటో నిర్ణయమైపోతుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌లో మాత్రం ఏ మార్పులూ ఉండవని ఈసీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది.