Lived Together for 43 Days in Past 22 Years  SC Dissolves Marriage of Doctor Couple : పెళ్లి చేసుకున్న కలిసి ఉండకపోతే ఆ వివాహానికి అర్థం ఉండదు. పెళ్లి అయిన తర్వాత రోజే పెళ్లి కూతురు అత్తగారి ఇంటి నుంచి వెళ్లిపోయి... లేనిపోని గొడవలకు దిగితే ఇక ఆ పెళ్లి నరకమే. చివరికి విడాకులకూ అంగీకరించకపోతే.. ఆ భర్త పడే బాధ వర్ణనాతీతం. ఇలాంటి భర్తకు సుప్రీంకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వెంటనే విడాకులు మంజూరు చేసింది. 


యూపీలోని మీరట్‌కు చెందిన ఇద్దరు డాక్టర్లకు 22 ఏళ్ల కిందట పెళ్లి అయింది. కానీ భార్యకు అత్తగారింట్లో ఏదో నచ్చలేదు. అందుకే తర్వాత రోజే పుట్టింటికి వెళ్లిపోయారు. అనేక సార్లు పెద్దలు చర్చలు జరిపితే అతి కష్టం మీద 23  రోజులు మాత్రమే కలిసున్నారు. అది కూడా వరుసగా కాదు. రాజీ  చేసినప్పుడే ఇలా కలిసి ఉన్నారు.. తర్వాత ఒకటి రెండు రోజులకే ఆ భార్య వెళ్లిపోయేది. ఈ క్రమంలో అనేక వివాదాలు కూడా వచ్చాయి. భార్యభర్తలు ఇద్దరూ పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. భార్య గృహహింస కేసు పెట్టడంతో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు కూడా జైలుకు వెళ్లివచ్చారు. 


ఇదంతా ఎందుకని ఆ భర్త విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడు. 2006లో మీరట్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే ఆ భార్య మాత్రం నిన్ను వదలని నీడని నేనే అంటూ.. విడాకుల డిక్రీని రద్దు చేయాలని అలహాబాద్ హైకోర్టుకు వెళ్లింది. 2019లో అలహాబాద్  హైకోర్టు .. మీరట్ కోర్టు మంజూరు చేసిన విడాకులను క్యాన్సిల్ చేసింది. దీంతో కాపురానికి రాని భార్య.. విడాకులు కూడా ఇవ్వకుండా వేధిస్తోందని.. ఆ భర్త సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్  ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ చంద్రశర్మ బెంచ్ విచారణ జరిపింది. 


గత ఇరవై రెండేళ్ల కాలంలో మొత్తంగా 23 రోజులు మాత్రమే కలిసున్నారని..  మరో ఇరవై రోజులు కోర్టు ఆదేశాలతో కలిసి ఉన్నట్లుగా చెప్పారని.. ఎలా చూసినా మొత్తంగా 22 ఏళ్ల కాలంలో 43 రోజులు మాత్రమే కలిసి ఉన్నారని ఇక ఈ వివాహానికి అర్థం ఏముందని ధర్మానసం ప్రశ్నించింది. అదే సమయంలో తనకు విడాకులు వద్దని ఇప్పటికైనా కలిసి ఉంటామని ఆ భార్య చెప్పినా ధర్మాసనం అంగీకరించలేదు. ఆమె ఇప్పటి వరకూ ప్రవర్తన ప్రకారం చూస్తే నమ్మశక్యంగా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో దిగువ కోర్టులు ఇలా వారిని కలిపేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని గుర్తు చేశారు. అదే సమయంలో ఇప్పుడు ఇద్దరూ యాభైల్లోకి వచ్చారని ఇప్పుడైనా వారి జీవితాలు వారు స్వతంత్రంగా గడపుకోనివ్వాలన్నారు.  


పెళ్లి చేసుకుంది గొడవ పడటానికే అన్నట్లుగా ఇరవై రెండేళ్ల పాటు లేనిపోని కేసులతో కాలక్షేపం చేసిన ఈ జంటకు విడాకులు మంజూరు చేయడమే కాకుండా.. ఎవరూ ఎవరికీ అలిమోని చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఇద్దరూ డాక్టర్లుగా పని చేస్తున్నారని వారు జీవించడానికి అవసరమైన ఆదాయం ఉందని స్పష్టం చేశారు.