Live Parasitic Worm In Woman Brain :ఆస్ట్రేలియాలో వైద్యులనే షాక్‌కు గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మెదడు నుంచి డాక్టర్లు బతికి ఉన్న పరాన్నజీవి (పారాసైట్‌)ను బయటకు తీశారు. అది బయటకు తీసిన తర్వాత కూడా కదులుతూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పరాన్న జీవి ఏకంగా 8 సెంటీమీటర్లు ఉంది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 


మతిమరుపు, డిప్రెషన్‌ లక్షణాలు.. 
64 ఏళ్ల ఓ మహిళ చాలా  రోజులుగా కడుపునొప్పి, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలతో ఇబ్బందులు పడుతోంది. వీటి కోసం ఎన్నో సార్లు మందులు వాడింది. ఆ తర్వాత రాత్రి పూట చమటలు, పొడి దగ్గు లాంటి లక్షణాలు కనిపించాయి. తొలుత 2021 జనవరి లో ఆమె ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కాగా ఎలాంటి ఫలితం లేకపోగా ఈ మధ్య మతిమరుపు, డిప్రెషన్‌ వంటి లక్షణాలు కనిపిస్తుండడంతో ఆమెను కాన్‌బెర్రా ఆస్పత్రిలో చేరారు. ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయగా మెదడులో సమస్య ఉందని ఆపరేషన్‌ చేయాలని వైద్యులు తెలిపారు. 


సర్జరీ సమయంలో మెదడులో కదులుతున్న పరాన్నజీవిని గుర్తిస్తామని అనుకోలేదని వైద్యులు తెలిపినట్లు కాన్‌బెర్రా ఆసుపత్రి అంటువైద్యుల డాక్టర్‌ సంజయ సేనానయకే గార్డియన్‌ పత్రికతో వెల్లడించారు. న్యూరో సర్జన్లు రెగ్యులర్‌గా మెదడులో ఇన్ఫెక్షన్లను గుర్తిస్తారని, కానీ ఇలా పారసైట్‌ కనిపించడం కెరీర్‌లో ఒక్కసారే జరిగే ఘటన లాంటిదని పేర్కొన్నారు. ఇది వైద్య చరిత్రలో అరుదైన ఘటనగా వారు వెల్లడించారు.


మెదడులో గుర్తించిన పరాన్నజీవిని ఓఫిడాస్కారిస్‌ రాబర్టీస్‌ నెమటోడ్‌ జాతికి చెందినదిగా గుర్తించినట్లు చెప్పారు. ఈ తరహా పరాన్నజీవులు ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌లో ఉండే ఒక రకమైన కొండచిలువల (కార్పెట్‌ పైథాన్స్‌) జీర్ణాశయాలలో నివసించడాన్ని గుర్తించారు. ఈ ఘటనను ఎమర్జింగ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ అనే జర్నల్‌లో డాక్యుమెంట్‌ చేశారు. ఈ కేసు చరిత్రలో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని వైద్యులు వెల్లడించారు. 


ఆపరేషన్‌ అనంతరం వైద్యులు సజీవంగా ఉన్న ఆ పరాన్నజీవిని నేరుగా పరాన్నజీవులపై చాలా అనుభవం ఉన్న శాస్త్రవేత్తకు చెందిన ప్రయోగశాలకు పంపించినట్లు వైద్యులు తెలిపారు. ఆ శాస్త్రవేత్త దీనిని చూడగానే ఇది ఓఫిడాస్కారిస్‌ రాబర్జీస్‌ అని చెప్పినట్లు వెల్లడించారు. కొండచిలువలు గడ్డి లేదా ఆకులపై విసర్జించిన వ్యర్థాల కారణంగా మహిళ శరీరంలోకి ఈ జీవి వెళ్లి ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. మహిళ ఆకుకూరలు ఇంటికి తీసుకురావడం వల్ల ఆ జీవికి సంబంధించిన గుడ్లు వంటపాత్రలు లేదా ఆహారం ద్వారా ఆమె శరీరంలోకి వెళ్లి లార్వాగా మారి ఉండొచ్చని చెప్తున్నారు. ఈ కేసు కారణంగా జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధుల ప్రమాదాల గురించి తెలియజేస్తోందని వైద్యులు తెలిపారు.


జంతువులను పెంచుకునేవాళ్లు జాగ్రత్తగా ఉండాలి 
బాధితురాలు ఆపరేషన్‌ తర్వాత నెమ్మదిగా కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. ప్రపంచంలో సంక్రమిస్తున్న అంటువ్యాధులలో 75 శాతం జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులే ఉంటున్నాయని వారు వెల్లడించారు. ఇవి జూనోటిక్‌ వ్యాధులని చెప్పారు. అందుకే జంతువులను పెంచుకునేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఆహారపదార్థాలు బయట నుంచి తెచ్చుకుని తినేప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఉడికించిన ఆహారం తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు.