పట్టుకుంటే వదలకుండా ఇతరుల రక్తం పీల్చే జలగను ఉప్పుతో చంపేయొచ్చని మీకు తెలుసా? అసలు ఉప్పు వల్ల జలగలు ఎందుకు చనిపోతాయి.. కారణాలేంటో తెలుసుకుందామా?
మీరు జలగ పేరు వినే ఉంటారు. రక్తం పీల్చే ఈ జీవిని చాలా మంది చూసి ఉంటారు. జలగలా రక్తం పీల్చేస్తున్నాడని తెలుగులో ఓ సామెత. అలాంటి జలగ ఉప్పు వల్ల చనిపోతుంది. జలగలు ఎక్కువగా తడి ప్రదేశాల్లో కనిపిస్తాయి. రక్తం పీల్చే పురుగుగా మనకు తెలిసిన జలగ మాంసాహార కీటకం. ఇది మనుషులతో పాటు అనేక జంతువుల రక్తాన్ని పీల్చుకోగలదు. జంతువులు లేదా మానవుల శరీరానికి అంటుకోవడం ద్వారా, అది వారి రక్తాన్ని పీలుస్తూనే ఉంటుంది. దాని కడుపు నిండాక వారిని వదిలేస్తుంది. దీంతో ప్రజలు తరచుగా ఉప్పును జలగలను తొలగించేందుకు ఉపయోగిస్తారు. ఇతరుల రక్తాన్ని పీల్చే ఈ పురుగు ఉప్పు వేయగానే చనిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జలగ ప్రధాన ఆహారం రక్తం
లీచ్ లేదా జలగ శాస్త్రీయ నామం 'హిరుడో మెడిసినాలిస్' (హిరుడినియా). జలగల్లో సుమారు ఆరు వందల రకాల జాతులు ఉన్నాయి. తేమతో కూడిన ప్రదేశాలలో మనకి జలగలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇది ఒక రకమైన హెమోఫేజిక్ వార్మ్, అంటే రక్తం దీని ప్రధాన ఆహారం. జలగ వ్యక్తి శరీరానికి అంటుకొని వారి రక్తాన్ని పీలుస్తుంది. జలగ వ్యక్తి చర్మానికి అంటుకున్నప్పుడు ఉప్పును చల్లి జలగను చర్మం నుంచి వేరు చేయవచ్చు. అయితే జలగ నొప్పి లేకుండా కాటు వేస్తుంది. దీనివల్ల జలగ తమను అంటుకున్న విషయం వ్యక్తులు లేదా జంతువులకు తెలియదు.
ఉప్పు వల్ల ఎందుకు చనిపోతుంది?
జలగ ఉప్పు వల్ల చనిపోవడానికి కారణం అందులోని రసాయన గుణాలు. జలగ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. జలగలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఉప్పు నీటిని గ్రహిస్తుంది. ఈ నేపథ్యంలో జలగ చర్మం పలుచగా ఉండడం వల్ల ఓస్మోటిక్ ప్రెజర్ అంటే ఆస్మాసిస్ ఒత్తిడి కారణంగా, ఉప్పు జలగ శరీరంలోని మొత్తం నీటిని గ్రహిస్తుంది. శరీరంలో నీరు లేనప్పుడు, కణాలు పనిచేయడం ఆగిపోయి జలగ ఊపిరాడక చనిపోతుంది.
వైద్య రంగంలో కీలకం
పురాతన ఈజిప్టు కాలం నుంచి నాడీ వ్యవస్థ, దంత సమస్యలు, చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల చికిత్సలో జలగలను వినియోగిస్తున్నారు. ఆధునిక వైద్య రంగంలోనూ జలగను కీలకంగా భావిస్తారు. జలగలు రక్తం గడ్డకుండా పనిచేసే పెప్టైడ్స్, ప్రోటీన్లను స్రవిస్తాయి. ఈ స్రావాలు గాయానికి రక్తం ప్రవహింపజేస్తాయి. దీంతో గాయం నయమయ్యేందుకు ఈ స్రావాలు ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక చర్మ వ్యాధులను నయం చేయడంలో వీటిని ఉపయోగిస్తున్నారు. జలౌక పద్ధతిలో, అనేక వ్యాధులకు జలగ సాయంతో చికిత్స అందిస్తారు. జలగలు శరీరంలోని మురికి రక్తాన్ని పీల్చి, మృతకణాలను నాశనం చేస్తాయి. ఇది కాకుండా, శరీరంలోని ఏదైనా భాగంలో చర్మం దెబ్బతిన్నప్పుడు, రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు, మృతకణాలను సక్రియం చేయడానికి జలౌకా పద్ధతిలో జలగల సాయం తీసుకుంటారు. అయితే జలగల సాయంతో చేసే ఈ వైద్యంలోనూ కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయని చెబుతారు.