Law Commission: చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించి అమల్లో ఉన్న పోక్సో చట్టంపై లా కమిషన్ శుక్రవారం కీలక సూచనలు చేసింది. పోక్సో చట్టం కింద లైంగిక కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయస్సును 18  ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. వయస్సును తగ్గించడం మంచిది కాదని కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖకు లా కమిషన్ ఒక నివేదిక సమర్పించింది. వయస్సు 16 ఏళ్లకు తగ్గిస్తే అది బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాపై జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నివేదికలో పేర్కొంది.


ఈ సందర్బంగా పోక్సో చట్టానికి లా కమిషన్ పలు సవరణలను సూచించింది. 16 నుంచి 18 ఏళ్ల మధ్య వారు ఇష్టపూర్వకంగా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే.. అలాంటి కేసుల్లో శిక్ష విధించే సమయంలో న్యాయస్థానాలు విచక్షణతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని లా కమిషన్ తెలిపింది.  ఈ నిర్ణయం మైనర్ల మధ్య పరస్పర అంగీకార శృంగార సంబంధాలను డీల్ చేయడంలో చట్టం సమతుల్యంగా ఉందని నిర్థారిస్తుందని లా కమిషన్ స్పష్టం చేసింది. అలాగే ఇది లైంగిక దోపిడీ నుంచి చిన్నారులను కాపాడుతుందని పేర్కొంది.


ఇలా కాకుండా పరస్పర అంగీకార వయస్సును తగ్గించడం వల్ల చట్టం దుర్వినియోగం అవుతుందని, నిజమైన కేసులకు హాని కల్గిస్తుందని లా కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.  16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలు ఏకాభిప్రాయంతో శృంగార కార్యకలాపాలకు పాల్పడితే.. అది కౌమారదశలోని అనియంత్రిత ప్రేమనా? లేదా ఏమైనా క్రిమినల్ ఉద్దేశాలు ఉన్నాయా? అనేది కోర్టులు గుర్తించి అప్రమత్తతో ఉండాలని లా కమిషన్ తెలిపింది.


ప్రస్తుతం శృంగార కార్యకలాపాలకు సమ్మతి తెలిపే వయస్సు 18 ఏళ్లుగా పోక్సో చట్టంలో పొందుపర్చారు. దీని ప్రకారం 18 ఏళ్లలోపువారితో లైంగిక చర్యలకు పాల్పడటం నేరంగా పరిగణస్తారు. ఒకవేళ వారి అంగీకారంతో పాల్గొన్నా అది నేరం అవుతుంది. దీంతో న్యాయస్థానాలు వయస్సును తగ్గిస్తూ చట్టంలో మార్పులు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో లా కమిషన్ దానిని వ్యతిరేకిస్తోంది. వయస్సును తగ్గించడం మంచిది కాదని చెబుతోంది. వయస్సును తగ్గించే బదులు కొన్ని సవరణలు చేస్తే సరిపోతుందని లా కమిషన్ పలు సిఫారస్సులు చేసింది. 16 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పిల్లలు సమ్మతితో శృంగారంలో పాల్గొంటే.. వారి కేసుల్లో యువతీ, యువకుల గతాన్ని పరిశీలించి కోర్టులు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతాన్ని పరిశీలించడం ద్వారా సమ్మతి స్వచ్చంధంగా ఉందా? లేదా? అనేది తెలుస్తుందని పేర్కొంది. ఇందుకోసం కోర్టులు విచక్షతో నిర్ణయం తీసుకునేలా వాటి పరిధిని పెంచితే బాగుంటుందని నివేదికలో పొందుపర్చింది.


కాగా గత ఏడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ పోక్సో చట్టం ప్రకారం సమ్మతి వయస్సుకు సంబంధించి ఆందోళనలు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని పార్లమెంట్‌ను కోరారు. న్యాయమూర్తులకు ఈ కేసులు పెద్ద సవాల్‌గా మారాయని, తన పదవీకాలంలో ఇలాంటి కేసులు  చాలా కష్టంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీజేఐ సూచనల క్రమంలో లా కమిషన్ నివేదిక ఇప్పుడు కీలకంగా మారింది.