Will Lalit Modi Get Arrested in India: ఐపీఎల్ వ్యవస్థాపకుడు, వివాదాస్పద పారిశ్రామికవేత్త లలిత్ మోడీ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి భారతదేశానికి రానున్నట్లు చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. గత 16 ఏళ్లుగా విదేశాల్లోనే నివాసముంటున్న మోడీ, తనపై ఉన్న చట్టపరమైన కేసులు , ఆరోపణల నుంచి ఉపశమనం పొందానని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
యూకేలో ఎందుకు ఉంటున్నారు?
2010లో ఐపీఎల్-3 ముగిసిన వెంటనే ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో లలిత్ మోడీని బిసిసిఐ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనపై పలు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఉల్లంఘన కేసులు నమోదు చేసింది. అయితే, కేవలం ఈ విచారణల వల్లే కాకుండా, ఐపీఎల్ క్రికెట్‌లో ఫిక్సింగ్‌కు తావివ్వకపోవడంతో అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సిండికేట్ నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయని మోడీ స్పష్టం చేశారు. ప్రాణ భయంతోనే తాను లండన్ పారిపోయానని, గత 16 ఏళ్లుగా లండన్‌లోని బెల్‌గ్రేవ్ స్క్వేర్‌లో నివాసముంటున్నానని తెలిపారు.
SAFEMA ట్రిబ్యునల్ కీలక తీర్పు
లలిత్ మోడీ భారత్‌కు రావడానికి సిద్ధపడటానికి ప్రధాన కారణం తాజాగా న్యూఢిల్లీలోని SAFEMA అంటే స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యూలేటర్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన కీలక తీర్పే. 2009లో దక్షణాఫ్రికాలో నిర్వహించిన ఐపీఎల్ టోర్నీకి సంబంధించి ఈడీ విధించిన భారీ జరిమానాలు, ప్రధాన ఆరోపణలను ట్రిబ్యునల్ కొట్టివేస్తూ మోడీకి పూర్తి ఉపశమనం ఇచ్చింది. ఈ కేసులో తానెప్పుడూ నిరపరాధినేనని, 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత చివరకు న్యాయం గెలిచి తనపై ఉన్న ప్రధాన లీగల్ అడ్డంకులు తొలగిపోయాయని, అందుకే అధికారికంగా క్లియరెన్స్ వచ్చినట్ల భావిస్తూ స్వదేశానికి రావడానికి సిద్ధమయ్యానని ఆయన ప్రకటించారు.
భారత్‌కు వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందా?
SAFEMA ట్రిబ్యునల్‌లో క్లియరెన్స్ వచ్చినంత మాత్రాన లలిత్ మోడీపై ఉన్న అన్ని వివాదాలు ముగిసిపోయినట్లు కాదనేది చట్ట నిపుణుల వాదన. గతంలో ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఉన్నప్పటికీ, యూకే నుంచి భారత్‌కు రప్పించేందుకు బ్రిటన్ కోర్టులు రెడ్ కార్నర్ నోటీసును ఆమోదించలేదు. ప్రస్తుతం FEMA కేసుల్లో ఉపశమనం దక్కినప్పటికీ, ఇతర దర్యాప్తు సంస్థల వద్ద ఇంకా ఏవైనా మనీ లాండరింగ్ కేసులు యాక్టివ్‌గా ఉంటే.. ఆయన భారత్‌లో కాలు మోపగానే విమానాశ్రయంలోనే ప్రశ్నించే లేదా ముందస్తు అరెస్ట్ చేసే అధికారం ఏజెన్సీలకు ఉంటుంది. అయితే, తనపై ఉన్న ప్రధాన లీగల్ పోరాటాలన్నింటిలోనూ నెగ్గానని నమ్ముతున్న మోడీ, ముందస్తు రక్షణ చర్యలతోనే భారత్‌కు వచ్చే అవకాశం ఉంది.
పాస్‌పోర్ట్ రద్దు.. రాక ఎప్పుడు?
భారత్ వదిలి వెళ్లిన తర్వాత లలిత్ మోడీ భారత పాస్‌పోర్ట్‌ను వదులుకుని వనాటు దేశ పౌరసత్వాన్ని పొందారు. కాబట్టి, ఇప్పుడు ఆయన భారతీయ పౌరుడిగా కాకుండా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ దరఖాస్తు ద్వారా లేదా ప్రత్యేక వీసా ద్వారా మాత్రమే భారత్‌లోకి ప్రవేశించగలరు. తాత కాబోతున్న సంతోషంలో ఉన్న మోడీ, ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఖచ్చితంగా భారత్‌కు వస్తానని వెల్లడించారు. చట్టపరమైన క్లియరెన్స్‌లు లభించినా, భారత దర్యాప్తు సంస్థలు ఆయన రాకపై ఎలా స్పందిస్తాయనేది వేచి చూడాల్సిందే.
