ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపుర్ ఘటన సంచలనం రేపింది. కేంద్ర మంత్రి కాన్వాయ్.. నిరసన చేస్తోన్న రైతులపైకి దూసుకెళ్లిన ఘటనలో ఇప్పటివరకు 8 మంది వరకు మృతి చెందినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. మృతుల్లో నలుగురు రైతులు ఉన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు అక్కడున్న రెండు ఎస్‌యూవీ వాహనాలకు నిప్పుపెట్టారు. వాహనంలో ఉన్న నలుగురు భాజపా కార్యకర్తలు మృతి చెందారు. పలువురు ఆసుపత్రి పాలయ్యారు.


ఆయన కుమారుడే కారణం..!


రైతులపైకి దూసుకెళ్లిన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఉన్నట్లు రైతులు ఆరోపించారు. వచ్చే ఏడాదిలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలున్న వేళ ఇలాంటి ఘటన జరగడం విపక్షాలు ఆయుధంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బాధితులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు.






కీ అప్‌డేట్స్..




    • లఖింపుర్ ఖేరీ జిల్లాలో భారీగా పోలీసులను మోహరించింది సర్కార్. నిన్న హింసాత్మక ఘటన జరిగిన ప్రదేశానికి స్థానికులను కూడా అనుమతించడం లేదు.

    • ఘటనాస్థలంలోనే కాకుండా పక్క గ్రామాలైన పలియా, పురాణ్‌పుర్, భీరా, బిజువా, ఖజురియాలలో కూడా పోలీసులను భారీగా మోహరించారు. 

    • పరిస్థితులను ప్రశాంతంగా చక్కదిద్దాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. రైతులపై ఎలాంటి బలప్రయోగం చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట.

    • ఘటన జరిగిన ప్రాంతంలో ఇంటర్నెట్‌ను నిలిపివేసినట్లు ఐఏఎన్‌ఎస్ పేర్కొంది.

    • ఏబీపీ సమాచారం మేరకు కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 

    • బాధితులను పరామర్శించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత శ్రీనివాస్ వెల్లడించారు.















    • సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను కూడా పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం.

    • లఖింపుర్ బాధితులను కలిసేందుకు ఉత్తర్‌ప్రదేశ్ వస్తామని ప్రకటించిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్‌జిందర్ ఎస్ రంధావా నిన్న ప్రకటించారు. విమానాశ్రయంలోనే వారిని అడ్డుకోవాలని యూపీ ఎడిషనల్ చీఫ్ సెక్రటరీ అవినాశ్ అవస్తీ లఖ్‌నవూ విమానాశ్రయ సిబ్బందిని ఆదేశించారు.






  • ఈ ఘటనను బంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సహా పలువురు తీవ్రంగా ఖండించారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు వేయాలని డిమాండ్ చేశారు.