ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరీ ఘటనపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా యోగి సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఘటనలో ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారని యూపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది.
యూపీ సర్కార్ జవాబు..
న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు యూపీ ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఘటనపై దర్యాప్తునకు సిట్‌తో పాటు న్యాయ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. శుక్రవారం ఆ నివేదికను సమర్పిస్తామని పేర్కొంది. దీంతో విచారణను శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.
లఖింపుర్ ఖేరిలో గత ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరపాలని కోరుతూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా అనే ఇద్దరు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ రమణకు లేఖ రాశారు. వీరి అభ్యర్థనను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
రైతులకు పరామర్శ..
లఖింపుర్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బుధవారం పరామర్శించారు. వీరి వెంట పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, దీపీందర్ సింగ్ హుడా ఉన్నారు.
Also Read:Covid 19 Guidelines: పిల్లల భద్రతపై కేంద్రం కొత్త రూల్స్.. పాటించకపోతే పాఠశాలల పని అంతే!