ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు - బస్సు ఢీకొన్న ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లుగా బారాబంకీ జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం ఉదయం బారాబంకీ జిల్లా దేవ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబర్హియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


ప్రమాదం ఎలా జరిగిందంటే..
రోడ్డు దాటుతున్న ఓ ఆవును తప్పించబోయి ప్రయాణికుల బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. రెండు భారీ వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. బస్సు సగం భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు.


ఈ రోడ్డు ప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బారాబంకీ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి ప్రమాదం గురించి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని, బాధిత ప్రజలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.


ఈ ప్రయాణికుల బస్సు డబుల్ డెక్కర్ బస్సు. ఇది ఢిల్లీ నుంచి బహ్రెయిచ్‌కు వెళుతోంది. బస్సు బరాబంకీ సమీపంలోని బాబర్హియా సమీపంలోకి చేరుకోగానే ఓ ఆవు రోడ్డు మీదికి వచ్చిందని, దాన్ని తప్పించబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అయితే, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. గాయపడినవారిలో గోండా, బహ్రెయిచ్, బారాబంకీ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉన్నట్లు వెల్లడించారు.