అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్రం.. ఈ-శ్రమ్ (e-Shram) అనే పోర్టల్ ప్రారంభించింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ-శ్రమ్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని అసంఘటిత రంగంలోని కార్మికుల వివరాలను డేటా‌బేస్‌లో భద్రపరచనున్నారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 38 కోట్ల కార్మికులు లబ్ధి పొందునున్నట్లు మంత్రి తెలిపారు.



రూ.2 లక్షల వరకు ఇన్సూరెన్స్.. 
ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న అసంఘటిత కార్మికులకు ఇన్సూరెన్స్ అందించనున్నట్లు భూపేందర్ తెలిపారు. యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కింద రూ.2 లక్షలు అందిస్తామని చెప్పారు. ఒక వ్యక్తి ప్రమాదానికి గురై మరణించినా లేదా శాశ్వత వైకల్యం పొందినా రూ.2 లక్షల సాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రమాదంలో పాక్షిక వైకల్యం పాలైతే రూ.లక్ష సాయం అందిస్తామని వెల్లడించారు. 


ఇందులో రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ-శ్రమ్ కార్డులు అందిస్తారు. 16 నుంచి 59 ఏళ్ల వయసున్న వారు ఈ-శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ-శ్రమ్ కార్డులో 12 నంబర్ల యూనివర్స్ అకౌంట్ నంబర్ ఇస్తారు. ఇది దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేస్తుంది. https://eshram.gov.in/ ద్వారా ఈ-శ్రమ్ కార్డు కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో ఆధార్ నంబర్, దీనికి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. పేరు, వృత్తి, చిరునామా, విద్యార్హత, నైపుణ్యాలు వంటి వివరాలను నమోదు చేసుకోవాలి. 





ఈపీఎఫ్ఓ లేదా ఈఎస్ఐసీ సభ్యులుగా ఉన్న వారు దీనికి రిజిస్టర్ చేసుకునేందుకు అనర్హులని కేంద్రం తెలిపింది.  దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14434ను సంప్రదించివచ్చని అధికారులు తెలిపారు.