కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బ్రిడ్జి ఒక్కసారిగా కొంత మేర కుంగిపోయింది. బి- బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న బ్రిడ్జి ఒక అడుగు మేర కుంగిన విషయం తెలిసిందే. అయితే ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్, డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు డ్యామ్ కు సంబంధించి కొన్ని విషయాలను మీడియాకు వెల్లడించారు.
28.25 లక్షల క్యూసెక్కుల ఫ్లో తట్టుకునేలా డ్యాం నిర్మాణం చేపట్టామని ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదిలినా ఎలాంటి ఇబ్బందీ కలగలేదని చెప్పారు. భారీ శబ్దం వచ్చిన తర్వాత బ్లాక్ 7 లో సింకింగ్ జరిగిందని చెప్పారు.
సంఘటన జరిగిన స్థలాన్ని డిజైన్ టీమ్, ఇంజినీర్ టీమ్ పరిశీలించారని చెప్పారు. డ్యాంలో నీటి లెవెల్స్ తగ్గాక ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. డ్యాంకి ఏం జరిగినా ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుందని అన్నారు. స్థానిక ప్రజలకు, వాతావరణానికి ఎలాంటి హానీ కలగనివ్వమని స్పష్టం చేశారు. డ్యాం డిజైన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఇంజనీర్ సురేష్ చెప్పారు. కానీ నిర్మాణం మాత్రం తామే చేపట్టామని వెల్లడించారు.
" జులై 2022లో వరదలు వచ్చినప్పుడు కూడా బ్యారేజ్ సురక్షితంగా తట్టుకుని పని చేసింది. నిన్న సాయంత్రం బ్యారేజీ బ్లాక్-7లోని ఒక చోట పెద్ద శబ్ధం రావడంతో వంతెన భాగం కుంగిపోవడం గమనించారు. రాష్ట్ర అధికారులతో కలిసి మా సాంకేతిక నిపుణుల బృందం కారణాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ సైట్‌కు వెళ్లారు. కారణాలను అంచనా వేసిన తర్వాత నష్టాలను సరిదిద్దడానికి అవసరమైన చర్యను ఎల్ అండ్ టీ తీసుకుంటుంది. వీలైనంత త్వరగా పరిష్కారానికి మార్గం చూపుతుంది" అని ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేష్ కుమార్ తెలిపారు.
అనంతరం డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... డ్యాం వద్దకు ఎల్ అండ్ టీ కంపెనీ నిపుణులు వచ్చారని వెల్లడించారు. భారీ శబ్దంతో డ్యాం కృంగిన ప్రాంతాన్ని సంస్థ ప్రతినిధులు పరిశీలించాలని చెప్పారు. డ్యాం ఎందువల్ల కృంగిందో ఇంకా పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక నిపుణుల బృందం కూడా వచ్చి పరిశీలిస్తారని తెలిపారు. డ్యాం ఎల్ అండ్ టీ అధీనంలో ఉందని అన్నారు. డ్యాం పూర్తి బాధ్యత వాళ్లే చూసుకుంటారని చెప్పారు. 20 నంబర్ పిల్లర్ వద్ద 1.50 ఫీట్లు కృంగిందని అన్నారు. డ్యాంసింగ్ పెద్ద సమస్య కాదని వెల్లడించారు.
నిన్న రాత్రి ఎలా ఉందో ప్రస్తుతం ఇప్పుడు అలానే ఉందని చెప్పారు. ప్రజల సేఫ్టీ కోసమే ఎవరినీ అనుమతించలేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ ఒత్తిడి తమపై లేదని అన్నారు. అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజినీర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున.. అవసరమైన మరమ్మతులు ఉంటే చేపడతామని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించే దిశగా ఇంజనీర్లు చర్యలు చేపడుతున్నారని డ్యామ్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు.