ఆంధ్ర- తెలంగాణల మధ్య రాజకీయ ఉద్రిక్తలకు కారణం అవుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించడానికి కృష్ణాబోర్డు కమిటీ సిద్ధమయింది. ఈ నెల ఐదో తేదీన కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని కమిటీ పరిశీలిస్తుంది. అక్కడ పనులేమైనా జరుగుతున్నాయా..? జరిగితే ఎలాంటి పనులు..? జరిగిన పనుల్లో పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి...? వంటి అంశాలన్నింటినీ పరిశీలించి.. వీడియో సహితంగా నివేదిక సిద్ధం చేయనున్నారు. ఆ తర్వాత ఆ నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌కు సమర్పిస్తారు. తమ పర్యటన విషయాన్ని లాంఛనంగా ఏపీ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు తెలిపింది.


రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించడం లేదు. సీమ ఎత్తిపోతల నిర్మాణానికి టెండర్లు పిలిచినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టులు కట్టవద్దని అప్పట్లోనే కృష్ణాబోర్డు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అప్పట్లో ఎన్జీటీలో పిటిషన్ వేయడంతో ..  విచారణ జరిపి ఎన్జీటీ కూడా స్టే ఇచ్చింది. అయినా ప్రాజెక్టు కడుతున్నారంటూ తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి వీడియోలతో సహా ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా తేలితే.. చీఫ్ సెక్రటరీని జైలుకు పంపుతామని హెచ్చరించి.. అక్కడి పనులను పరిశీలించి..నివేదిక ఇవ్వాలని కృష్ణాబోర్డును , పర్యావరణ శాఖను ఆదేశించింది. 


అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించడానికి అంగీకరించలేదు. దాంతో ఎన్జీటీ ఆదేశాలున్నా... ఆ ప్రాంతాన్ని పరిశీలించలేకపోయారు. చివరికి తెలంగాణ సర్కార్ మళ్లీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. మళ్లీ విచారణ జరిపిన ఎన్జీటీ  సీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని పరిశీలించి అక్కడేమైనా పనులు జరుగుతున్నాయో లేదో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేదని నేరుగా వెళ్లి పరిశీలించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.   అయితే.. ఏపీ సర్కార్ మాత్రం అక్కడ పనులేమీ జరగడం లేదని.. డీపీఆర్‌కు అవసరమైన సర్వే పనులు మాత్రమే చేస్తున్నామని చెబుతోంది. కావాలంటే తామే నివేదిక ఇస్తామని వాదించింది. 


కేఆర్ఎంబీ పర్యటనపై ఏపీ ప్రభుత్వానికి లాంఛనంగా సమాచారం అందింది. అయితే ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. బృందంలో తెలంగాణ సభ్యులు ఉన్నారని.. వారికి అనుమతి ఇవ్వబోమని చెబుతోంది. సీమ ఎత్తిపోతల విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. అక్కడకు ఎవర్నీ అనుమతించాలని అనుకోవడం లేదు. దీంతో ఐదో తేదీన ఏం జరుగుతుందోనన్న టెన్షన్ రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. కేంద్ర బలగాలు  కేఆర్ఎంబీకి రక్షణగా ఉండే అవకాశం ఉంది.