Konaseema District News: డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముక్తేశ్వరంలో ఉన్న వైవిఎస్ అండ్ బీఆర్ఎం నర్సింగ్ కాలేజీ హాస్టల్ భవనం పైనుంచి ఓ విద్యార్థిని కింద పడిపోయింది. ఈ క్రమంలోనే విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన తోటి విద్యార్థులు బాధితురాలిని వెంటనే అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు విద్యార్థినికి మూడు చోట్ల ఎముకలు విరిగినట్లు తెలిపారు. కాలు, చేయిపై మూడు చోట్ల ఎముకలు విరిగాయని వెల్లడించారు. అయితే బాధితురాలు పల్లవి(19) మొదటి సంవత్సరం చదువుతోంది. 


ఎవరో తోసేశారంటున్న బాధిత విద్యార్థిని..!


పల్లవి ఇచ్చిన వాంగ్మూలంలో.. శనివారం ఉదయం రెండవ అంతస్థుపై నుండి తనను తోటి విద్యార్థినులు గెంటివేశారని చెబుతోంది. కళాశాల హాస్టల్ రూంలో పల్లవితో పాటు మరో ఏడుగురు విద్యార్థినులు కలిసి ఉంటున్నారు. రాత్రి ఒకరి డబ్బులు పోయాయని అందరి బ్యాగుల్లో వెతికినట్లు సమాచారం. ఉదయం బ్రష్ చేస్తున్న సమయంలో ఎవరో వచ్చి వెనక నుంచి గెంటేశారని పల్లవి చెబుతోంది. మరోవైపు పల్లవి తల్లిదండ్రులు కూడా తోటి విద్యార్థినులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స సమయంలో తనకు తానే కళ్లు తిరిగి పడిపోయానని విద్యార్థిని వెల్లడించింది. ఈ సంఘటనపై బీఆర్ అంబేడ్కర్ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం బాధితురాలు పల్లవి అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.