Kodali Nani Comments on Revanth Reddy: ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక, ఏపీ సీఎం జగన్ (CM Jagan) శుభాకాంక్షలు చెప్పకపోవడంపై కొడాలి నాని స్పందించారు. రేవంత్ రెడ్డికి జగన్ ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. మాకేం పని లేదా అని మాట్లాడారు. కేసీఆర్ ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ఏమైనా తుంటి విరిగిందా పరామర్శించడానికి అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సిన అవసరం తమకి ఏంటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపాయింట్‌మెంట్ తనకు అవసరం లేదని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎంగా గెలిచినప్పుడు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ లో అభినందించాని గుర్తు చేశారు. ఫోన్ చేసి అభినందించాల్సిన పని ఏం ఉందని అన్నారు.
కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతు ఇవ్వడంలో వింత ఏముందని కొడాలి నాని ప్రశ్నించారు. అవసరమైతే రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోని పని చేసుకోవచ్చని.. తమకేం సంబంధం అంటూ మాట్లాడారు.
వచ్చే ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం చంద్రబాబు టికెట్లను అమ్ముకుంటున్నారని కొడాలని నాని ఆరోపించారు. కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నానిని మోసం చేసి.. రూ.150 కోట్లకు ఎంపీ సీటును కేశినేని చిన్నికి అమ్ముకున్నారని ఆరోపించారు. అటు గుడివాడలో కూడా రూ.100 కోట్లు ఇచ్చిన వ్యక్తికి సీటు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటున్నారని విమర్శించారు.